సెనేట్ లో ఇప్పుడు డెమొక్రాట్లదే పైచేయి
అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన క్రమంలోనే.. కొత్తగా ఎన్నికైన ముగ్గురు డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్లు కూడా ప్రమాణం చేశారు. జార్జియా నుంచి ఎన్నికైన పాత్రికేయుడు ఒస్సోఫ్, అట్లాంటాకు చెందిన పాస్టర్ వార్నాక్, కాలిఫోర్నియా నుంచి గెలుపొందిన అలెక్స్ పడిల్లాలతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రమాణం చేయించారు. దీంతో ఇప్పటివరకు రిపబ్లికన్లు ఆధిక్యత చాటుతూ వచ్చిన సెనేట్లో ఇప్పుడు డెమొక్రాట్లు పైచేయి సాధించినట్టుయింది. కొత్త అధ్యక్షుని ప్రమాణం రోజు ఆయన యంత్రాంగానికి సంబంధించిన కొంతమంది నియామకాలకు సెనేట్ ఆమోదం తెలపడం ఆనవాయితీ. ఈ మేరకు కొత్త సభ్యుల ప్రమాణం అనంతరం సభ సమావేశమైంది. అధ్యక్షుని భద్రతా బాధ్యతలు చేపట్టే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరుగా బైడెన్ తన కాబినెట్కు నామినేట్ చేసిన అర్విల్ హైనెస్ నియామకానికి 84-10 ఓట్ల తేడాతో సెనేట్ ఆమోదం తెలిపింది.






