బ్రిటన్ తో సత్సంబంధాలకు బైడెన్ ప్రథమ ప్రాధాన్యం
వాషింగ్టన్: బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లో సంభాషించారు. తమ రెండు దేశాల మధ్య ఉన్న ‘ప్రత్యేక సంబంధాలను’ మరింత బలోపేతం చేయాలనుకుంటున్నానని, ట్రాన్స్అట్లాంటిక్ సంబంధాలను కూడా పటిష్టం చేయాలనుకుంటున్నానని బైడెన్ స్పష్టం చేశారని వైట్‌హౌస్ తెలియజేసింది.
ఆయన గత శనివారం బోరిస్‌కు ఫోన్ చేశారు. అధ్యక్షుడుగా అధికారంలోకి వచ్చీ రాగానే బైడెన్ మొదటగా ఫోన్ చేసింది బ్రిటిష్ ప్రధానికే కావడాన్ని బట్టి బ్రిటన్‌తో సంబంధాలకు బైడెన్ ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నదీ తేటతెల్లం అవుతోంది. డొనాల్డ్ ట్రంప్ 2016లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసి మాట్లాడిన దేశాధినేతల జాబితాలో బ్రిటిష్ ప్రధాని 11వ వ్యక్తి కావడం గమనించాల్సిన విషయం.
బోరిస్ జాన్సన్‌తో కలిసి సన్నిహితంగా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు బైడెన్ తన ఫోన్ సంభాషణలో స్పష్టం చేశారు. ఈ ఏడాది బ్రిటన్ జి 7, ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
”ఉభయ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాలను పటిష్టం చేయాలనుకుంటున్నట్టు, ట్రాన్స్అట్లాంటిక్ సంబంధాలను కూడా దృఢం చేయాలనుకుంటున్నట్టు అధ్యక్షుడు బ్రిటిష్ ప్రధానికి తెలియజేశారు. తమ సమష్టి రక్షణ కోసం నాటో పోషించాల్సిన కీలక పాత్ర గురించి, తమ ఉమ్మడి విలువలను కాపాడుకోవడం గురించి అధ్యక్షుడు నొక్కి చెప్పారు” అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలియజేసింది.
వివిధ బహుళజాతి సంస్థల ద్వారానే కాక, ఇతరత్రా కూడా పరస్పర సహాయ సహకారాల గురించి, వాతావరణ మార్పు, ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరాటం, ఆరోగ్య భద్రత ఉమ్మడి సవాళ్ల గురించి కూడా బైడెన్ విస్తృతంగా చర్చించారు.
చైనా, ఇరాన్, రష్యాతో సహా వివిధ ఉమ్మడి విదేశాంగ విధాన ప్రాధాన్యల విషయంలో కూడా సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని అధ్యక్షుడు స్పష్టం చేసినట్టు వైట్‌హౌస్ వెల్లడించింది.
మెక్సికో అధ్యక్షుడు ఆండ్రూస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రేడర్తో కూడా బైడెన్ ఫోన్లో సంభాషించారు. ముఖ్యంగా ప్రాంతీయ వలసల వంటి సమస్యలతో సహా వివిధ కీలక అంశాలపై ద్వైపాక్షిక సహకారం గురించి వారు సమీక్ష జరిపారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలియజేసింది.
”మూల కారణాలను చక్కదిద్దడం ద్వారా వలసలను తగ్గించాలనే తన ప్రణాళిక గురించి అధ్యక్షుడు మాట్లాడారు. పునరావాస సామర్థ్యం పెంచడం, చట్టబద్ధమైన ప్రత్యామ్నాయ వలస మార్గాలను పరిశీలించడం, ఆశ్రయం కోసం సరిహద్దుల వద్ద తీసుకునే అభ్యర్థలను న్యాయపరంగా ఆమోదించడం, గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని అక్రమ వలస విధానాలను రద్దు చేయడం వంటి కీలక అంశాల మీద ఈ ఇద్దరు అగ్ర నాయకులూ చర్చించారు” అని వైట్‌హౌస్ తెలిపింది.
మెక్సికో, అమెరికా దేశాలకు అక్రమంగా వచ్చే వలసలను నివారించడానికి, సెంట్రల్ అమెరికాలోని ఉత్తర త్రికోణ ప్రాంతంలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉభయ దేశాలూ సన్నిహితంగా పనిచేయడానికి ఉభయులూ సుముఖత వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి పరస్పర సమన్వయంతో, సహకారంతో పనిచేయడానికి ప్రాధాన్యమివ్వాల్సిన అవసరాన్ని కూడా వారు తమ సంభాషణల్లో గుర్తించారు. జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బైడెన్ ముగ్గురు అధినేతలతో ఫోన్లో సంభాషించారు. అందులో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కూడా ఉన్నారు.






