రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. అత్యంత భారీ పెట్టుబడి ఇదే
కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేసింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని తీసుకువచ్చారు. అది కూడా అధికారంలోకి వచ్చిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ భారీ ఉద్దీపన ప్యాకేజీని తీసుకొచ్చి ఉభయ సభల్లో గెలిపించుకోవడం విశేషం. తాజాగా బైడెన్ మరో భారీ ఫ్యాకేజీని ప్రకటించారు. ఈ సారి మౌలిక సదుపాయాల రంగానికి ప్రయోజనం చేకూర్చే భారీ ప్యాకేజీని ప్రకటించారు. వచ్చే ఎనిమిదేళ్లలో మౌలిక రంగ అభివృద్ధికి 2.3 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.168 లక్షల కోట్ల) ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
మౌలిక సదుపాయాలను ఆధునికీకరించేందుకూ, వాతావరణ మార్పుల కారణంగా ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకూ, పోటీ ప్రపంచంలో అమెరికాను దీటుగా నిలిపేందుకూ ఈ ప్రణాళిక ఇతోధికంగా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. పెన్సిల్వేనియాలోని పీట్స్బర్గ్ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. రాబోయే ఎనిమిదేళ్లలో మౌలిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 2.3 ట్రిలియన్ డాలర్ల ప్రతిపాదనలు చేస్తున్నాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో అతిపెద్ద ఉద్యోగాల కల్పన పెట్టుబడి ఇదే. ఈ ప్రణాళిక అమలైతే నాలుగేళ్లలో 1.8 కోట్ల అధిక వేతన ఉద్యోగాలు సృష్టించవచ్చు అని తెలిపారు.






