అమెరికాకు కొత్త దిశ, దశ!
బైడెన్ తలపెట్టిన కొత్త ప్లానుతో అమెరికా రూపురేఖలు మార్పు
వాషింగ్టన్ః అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రూపొందించిన 2.3 ట్రిలియన్ డాలర్ల భారీ ప్రాథమిక సదుపాయాల కల్పన ప్లాన్‌తో దేశం రూపురేఖలే మారిపోనున్నాయి. ఈ భారీ పథకం దేశానికి కొత్త దిశను, దశను కల్పించబోతున్నాయి. దేశంలోని సుమారు 10,000 వంతెనలను బాగు చేయడంతో పాటు, లక్షలాది ఇళ్లలో దెబ్బతిన్న పైపులను మరమ్మతు చేయడం కూడా ఆయన పథకంలో ప్రధాన భాగం.
అంతేకాదు, సుమారు 20,000 మైళ్ల పొడవైన అనేక రహదారులను, రోడ్లను కూడా మరమ్మతు చేసి, ఆధునికం చేయడానికి భారీగా నిధులు పెట్టుబడి పెట్టబోతున్నారు. పది ‘ఆర్థికంగా ముఖ్యమైన’ భారీ వంతెనలతో పాటు, 10,000 వంతెనలను పునరుద్ధరించి, ఆధునికం చేసి, ఎటువంటి రాకపోకలకైనా, రవాణాకైనా సిద్ధం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
సైకిళ్లపై వెళ్లేవారికి, పాదచారులకు ఎటువంటి హానీ జరగకుండా, సురక్షితంగా తిరగడానికి వీలుగా సుమారు 200 కోట్ల డాలర్లతో అనేక రోడ్డు మార్గాల తీరుతెన్నులను మార్చేయడం జరుగుతుంది. ప్రధాన రహదారులకు కలిపే విధంగా మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్డు మార్గం పక్కాగా ఉండడానికి మరో 2,000 కోట్ల డాలర్లు వ్యయం చేయాలని సంకల్పించారు.
ఇతరత్రా ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి, ఆమ్ట్రాక్ అనే పథకాన్ని మరింత సజావుగా అమలు చేయడానికి సుమారు 8,000 కోట్ల డాలర్లను ఖర్చు చేయబోతున్నారు. ఇక దేశంలోని విమానాశ్రయాల అభివృద్ధికి 2,500 కోట్ల డాలర్లు, జల మార్గాల అభివృద్ధికి 1,700 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తారు. ఇందులో భాగంగానే రేవు పట్టణాలను, పడవలను అభివృద్ధి చేయడానికి, విమానాశ్రయాలలోను, రేవుల్లోను కాలుష్యాన్ని తగ్గించడానికి పెట్టుబడులు పెడతారు.
భారీగా రవాణా సౌకర్యాలు
భారీగా రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడంతో పాటు, మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండే విధంగా మరో 2,500 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తారు. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీదార్లను ప్రోత్సహించాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి వాహనాలను తయారు చేసేవారి మీద 17,400 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటి కోసం దేశీయంగా సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు, వాటిని కొనే వినిమయదార్లకు రాయితీలు, తగ్గింపులు అందజేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.
గృహ ప్రాథమిక సదుపాయాల మెరుగుదల మీద 65,000 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టడానికి బైడెన్ పథకం తయారు చేసింది. ఇళ్లను నాణ్యంగా, ఆధునికంగా తీర్చి దిద్దడానికి ఈ నిధులను ఖర్చు చేయడం జరుగుతుంది. బ్రాడ్‌బ్యాండ్, పరిశుభ్రమైన నీరు, ఎలక్ట్రిక్ గ్రిడ్ వంటి మెరుగైన సౌకర్యాలను కల్పిస్తారు. సుమారు కోటి కుటుంబాలకు ప్రయోజనం కలిగే విధంగా నీటి సరఫరా పైపులను మార్చడం, సర్వీస్ లైన్లను మెరుగుపరచడం వంటి పనులు చేపడతారని వైట్‌హౌస్ తెలియజేసింది.
మారుమూల ప్రాంతాలు, గ్రామాలకు కూడా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందడానికి ఏర్పాట్లు చేస్తారు. సుమారు 35 శాతం గ్రామాలకు ఈ సౌకర్యం అందుబాటులో లేదు. సుమారు 20 లక్షల గృహాలు దీనివల్ల లబ్ధి పొందుతాయని అంచనా. అక్కడి ఆస్పత్రులకు కూడా దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇక సుమారు 1,000 కోట్ల డాలర్లను పాఠశాలల అభివృద్ధి మీద ఖర్చు చేయడం జరుగుతుంది. ఇందులో 500 కోట్ల డాలర్లను నేరుగాను, మరో 500 కోట్ల డాలర్లను బాండ్ల రూపంలోనూ సమకూర్చుతారు.
కోట్లాది మందికి ఉపాధి
దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో కొన్ని అనుత్పాదక చమురు, సహజ వాయువుల బావులను, గనులను మూసేసే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలన్నిటి వల్ల దేశంలో కోట్లాది మంది అమెరికన్లకు ఉపాధి లభిస్తుందని బైడెన్ ప్రభుత్వం ఆశిస్తోంది. దీనివల్ల దేశం ఆర్థికంగా పుంజుకోవడానికి కూడా అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతి ఆరు మంది అత్యవసర సేవా కార్యకర్తల్లో ఒకరు పేదరికంలో మగ్గుతున్నారని వైట్‌హౌస్ ప్రకటించింది. వీరిని అన్ని విధాలా ఆదుకుని, వీరి జీవితాలను మెరుగుపరచడానికి, వీరికి నాణ్యమైన జీవితాన్ని అందించడానికి బైడెన్ ప్రభుత్వం 4,000 కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని సంకల్పించింది. వృద్ధులు, వికలాంగులు తదితర వర్గాలకు ఈ కార్యకర్తలు సేవలందిస్తుంటారు.
ఇక ఉత్పత్తి, తయారీ, శిక్షణ, పరిశోధన వంటి రంగాల మీద 5,800 కోట్ల డాలర్లు వ్యయమయ్యే పథకానికి కూడా బైడెన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో దేశీయ సెమికండక్టర్ల ఉత్పత్తి మీద 500 డాలర్లు ఖర్చు చేయదలచుకుంది. పరిశుభ్రమైన ఇంధనం, నాణ్యమైన విద్యుచ్ఛక్తి మీద 18,000 కోట్ల డాలర్లు ఖర్చు చేయబోతోంది. బొగ్గు గనుల్లో కొత్తగా ఉద్యోగాలు సృష్టించే కంపెనీలకు భారీ ప్రోత్సాహకాలు అందజేయదలచుకుంది.
ఈ వ్యయమంతా ఎక్కువగా కంపెనీల మీదే ఉండేటట్టుగా పన్నులు నియమ నిబంధనల్లో భారీ మార్పులు, చేర్పులు చేపట్టింది. 2017 నుంచి ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన 21 శాతం కార్పొరేట్ పన్నును బైడెన్ ప్రభుత్వం 28 శాతానికి పెంచదలచుకుంది. వ్యర్థమైన, శిథిలమైన పరిశ్రమలకు, అనుత్పాదక పరిశ్రమలకు ఇంత వరకూ ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేయదలచుకుంది.
ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసే పక్షంలో పదిహేనేళ్ల కాలంలో ప్రభుత్వ పెట్టుబడులు సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. దీనివల్ల జీడీపీ 0.5 పెరుగుతుందని కూడా అది పేర్కొంది. భవిష్యత్తులో ప్రభుత్వ బడ్జెట్ లోటు కూడా క్రమంగా దిగివస్తుందని అది తెలిపింది.






