అమెరికన్లకు మరో ఫ్రీ చెక్కు.. బైడెన్ కు డెమొక్రాట్ల లేఖ!
వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలం అయిన అగ్రరాజ్యంలో ప్రజల జీవితాలను మళ్లీ గాడిలో పెట్టడం కోసం కరోనా స్టిమ్యులస్ ప్యాకేజిని బైడెన్ ప్రకటించారు. ఎన్నికల్లో ఆయన హామీ ఇచ్చినట్లుగానే అధికారం చేపట్టిన తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రెండు సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లు ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ సంతకంతో చట్ట రూపం దాల్చింది. ఈ క్రమంలోనే కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మూడు దఫాలుగా 3,200 డాలర్ల విలువైన చెక్కులు పంపడం జరిగింది. ఇంతకుమించి ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తారా? లేదా? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. దీనిపై అధికార డెమొక్రాట్ పార్టీ నేతలు స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మరో చెక్కు ఇవ్వాలని వారు సూచించారు. ఇప్పటి వరకూ ఇచ్చిన సొమ్ముతో 1.2కోట్ల మంది ప్రజలకు ఆహారం, ఇల్లు లభిస్తాయని వారు చెప్పారు. అయితే మరో చెక్కు ఇవ్వడం ద్వారా ఈ సంఖ్య మరో 63లక్షల మందికి లబ్ది చేకూరుతుందని లేఖలో తెలిపారు. ప్రస్తుతం కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో చెక్కు ఇస్తే.. అది వారి జీవితాలకు తాత్కాలిక జీవనాధారంగా మారుతుందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎంత ఆర్థిక సాయం చేసినా తక్కువేనని డెమొక్రాట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై బైడెన్ టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.






