అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్ గా వనితా గుప్తా
భారతీయ అమెరికన్ న్యాయవాది వనితా గుప్తా(46) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వనితను అసోసియేట్ అటార్నీ జనరల్‌గా ఎంపిక చేశారు. అనంతరం ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అసోసియేట్ అటార్నీ జనరల్‌గా నేను వనితా గుప్తాను ఎంపిక చేస్తున్నాను. ఆమె నాకు కొంత కాలం నుంచి తెలుసు. వనిత అమెరికాలో అత్యంత గౌరవనీయమైన పౌర హక్కుల న్యాయవాదుల్లో ఒకరు. సమానత్వం, స్వేచ్ఛ కోసం తన వంతు కృషి చేశారు. ఆమె భారత్ నుంచి వలస వచ్చిన గర్వించదగ్గ కుమార్తె అని బైడెన్ ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. బైడెన్ న్యాయ శాఖలోని కొన్ని కీలక నియామకాలపై ప్రకటనలు చేశారు. అయితే సెనేట్ కనుక వనిత నియామకాన్ని ధ్రువీకరిస్తే.. ఆమె ఈ కీలక పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్వేతజాతికి చెందని మొదటి వ్యక్తిగా నిలుస్తారు.
వనిత మొదట ఎన్ఏఏసీపీ లీగల్ డిఫెన్స్ ఫండ్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌లో విధులు నిర్వర్తించారు. అనంతరం ఒరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో న్యాయ శాఖలోని పౌర హక్కుల విభాగానికి నాయకత్వం వహించారు.






