అగ్రస్థానంలో ఉన్న నలుగురు అభ్యర్థులకు మాత్రమే చోటివ్వండి
వచ్చే నెలలో జరిగే పార్టీ చర్చా వేదికకు అగ్రస్థానంలోని నలుగురు అభ్యర్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి తమపార్టీ జాతీయ సంఘాన్ని కోరారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిమీ వ్యాలీలో జరిగిన రెండోవిడత చర్చా వేదికలో రామస్వామి, నిక్కీ హేలీలతోపాటు మొత్తం ఆరుగురు అభ్యర్థులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాను ప్రజాదరణలో అగ్రగామిని కాబట్టి పార్టీ చర్చలకు రానక్కర్లేదని భావించిన వీటికి దూరంగా ఉంటున్నారు. నవంబరు 8న మియామీలో మూడో చర్చా వేదికకు జరగనుంది. ఎక్కువమంది చర్చలో పాల్గొంటే ఎవరేం చెబుతున్నారో అర్థం కాదని రామస్వామి ప్రచార కమిటీ చెబుతోంది. ఈ చర్చకు ట్రంప్, డిశాంటిస్, నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి అర్హులుగా కనిపిస్తున్నారు.






