డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం రిపబ్లికన్ల తంటాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ పదవికి ఎన్నికయ్యేలా చేసేందుకు రిపబ్లికన్ పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది. దేశ ప్రజల్లో దిగజారిన ఆయన ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న ఆ పార్టీ జాతీయ సదస్సును వేదికగా చేసుకొంది. అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ట్రంప్‍ను ఈ సదస్సులోనే రిపబ్లికన్లు లాంఛనంగా ప్రకటించారు. వలస ప్రజల పట్ల, విదేశీయులకు ఉద్యోగాల విషయంలోనూ ట్రంప్ వైఖరి తీవ్ర విమర్శలకు గురైంది. కరోనా వైరస్‍ను అడ్డుకొనే అంశతో పాటు విదేశాంగ విధానంలోనూ వైఫల్యాలు ఆయన గ్రాఫ్‍ను కిందికి లాగాయి. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు రిపబ్లికన్లు తమ ప్రచారా వ్యూహాన్ని మార్చారు.
డొనాల్డ్ ట్రంప్ మనసున్న మారాజు అంటూ ప్రచార కటౌట్లు సిద్ధం చేస్తున్నారు. సదస్సులో మాట్లాడిన వ్యక్తలందరూ ట్రంప్ మంచితనాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రిపబ్లికన్ల జాతీయ సదస్సులో ట్రంప్ కుటుంబ సభ్యులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రంప్ భార్య, దేశ ప్రథమ మహిళ మెలానియా, కుమారులు ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, కుమార్తె టిఫనీ ట్రంప్ సదస్సులో మాట్లాడారు. అమెరికన్లను అగ్రస్థానంలో నిలిపేందుకు తన భర్త కృషి చేస్తున్నారని, మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని మెలానియా కోరారు.