ATA: వాషింగ్టన్ డీసీలో లారా విలియమ్స్‌తో జయంత్ చల్లా సమావేశం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) అధ్యక్షుడు జయంత్ చల్లా (Jayanth Challa) ఇటీవల హైదరాబాద్‌లోని నూతన యూ.ఎస్. కాన్సుల్ జనరల్ గా నియమితులైన శ్రీమతి లారా విలియమ్స్ (Laura Williams) తో వాషింగ్టన్ డీసీలో సమావేశమయ్యారు. వాషింగ్టన్, డి.సి.లోని యూ.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న శ్రీమతి విలియమ్స్, పదవీకాలం ముగిసిన తరువాత ప్రస్తుత హైదరాబాద్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ స్థానంలో ఆమె కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను జయంత్ చల్లాతోపాటు ఆటా నాయకులు పలువురు కలిశారు. ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్ గ్రూప్ రవి పూలి సమన్వయంతో శ్రీమతి లార్సన్‌తో లంచ్ మీటింగ్ అయింది.
ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఇండో-అమెరికన్, తెలుగు కమ్యూనిటీలు రెండింటికీ ముఖ్యమైన అంశాలతోపాటు, అలాగే యూ.ఎస్.-ఇండియా/తెలుగు కమ్యూనిటీతో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన సహకార చర్యలు వంటి వివిధ విషయాలు చర్చకు వచ్చాయి. భారత విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించడం, వ్యాపార సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలు కూడా చర్చించారు. శ్రీమతి విలియమ్స్ మరియు ఇద్దరు మాజీ యూ.ఎస్. దౌత్యవేత్తలు, కాథీ హద్దా మరియు వినయ్ తుమ్మలపల్లిలతో జరిగిన ఈ సమావేశంలో, శ్రీ చల్లా తెలుగు అమెరికన్ కమ్యూనిటీకి ఆటా అందిస్తున్న సేవల గురించి వివరించారు. యూ.ఎస్.లోని విశ్వవిద్యాలయాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు ఓరియంటేషన్ సెషన్‌లను అందించే అవకాశం గురించి వారు చర్చించారు. హైదరాబాద్ కాన్సులేట్ ఆసియాలోనే అతి పెద్దది మరియు ప్రపంచంలో మరే ఇతర దేశాలకంటే ఎక్కువ విద్యార్థి వీసాలను ప్రాసెస్ చేస్తుంది. తప్పుడు సమాచారాన్ని నివారించడమే ఓరియంటేషన్ చేయాలనే ఆలోచన అని ఆటా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పులి రవి, ఆటా నాయకులు, ఎన్నారైలు పాల్గొన్నారు.