Delhi: వెనెజువెలా సంక్షోభం.. భారత్ కు లాభమా..? నష్టమా…?
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెనెజువెలాపై అమెరికా పట్టుసాధించింది. ఇప్పుడక్కడ ఉన్న చమురు నిల్వల్ని వెలికితీసి.. అపార సంపదను ఖజానాకు తరలించాలని చూస్తోంది. మరి దీనివల్ల భారత్ కు ఎలాంటి పరిస్థితి ఎదురుకానుంది. వెనెజువెలాలో అమెరికా కంపెనీలు అడుగు పెడితే.. భారత్ కు లాభమా..? నష్టమా..? ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.
అమెరికా, వెనెజువెలా మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతదేశంపై తక్షణ ప్రభావం చూపబోవని… ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశ చమురు దిగుమతి వ్యయం పెరిగే అవకాశం లేదని ఓ నివేదిక స్పష్టం చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు సరఫరా అవసరానికి మించి (గ్లట్ మోడ్) ఉండటం, అంతర్జాతీయ ఉత్పత్తిలో వెనెజువెలా వాటా కేవలం 1 శాతం మాత్రమే కావడం ఇందుకు ప్రధాన కారణాలు. అందువల్ల, వెనెజువెలాలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా, భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నివేదిక భరోసా ఇచ్చింది.
వెనెజువెలాలో నిరూపితమైన చమురు నిల్వలు చాలా ఎక్కువని, ప్రపంచ మొత్తం నిల్వల్లో దాదాపు 19.4 శాతం అక్కడే ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది. ఈ భారీ నిల్వలను వెలికితీసి, సరఫరా పెంచేందుకు అమెరికా కంపెనీలు రంగంలోకి దిగవచ్చన్న మార్కెట్ అంచనాలతో ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం భారత్కు మేలు చేసే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
“ప్రస్తుత ప్రపంచ సరఫరా పరిస్థితులు, మిగులు నిల్వలను పరిగణనలోకి తీసుకుంటే, సమీప భవిష్యత్తులో భారత్ ఆయిల్ దిగుమతి బిల్లు పెరిగే ప్రమాదం కనిపించడం లేదు” అని నివేదికలో స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా కంపెనీలు వెనెజువెలాలో ఉత్పత్తిని పెంచితే, అంతర్జాతీయంగా ధరలు మరింత తగ్గి, భారత్ సహా అన్ని దేశాలకూ లబ్ధి చేకూరుతుందని మరో నివేదికలో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
భారత్-వెనెజువెలా వాణిజ్య సంబంధాలు
భారత్, వెనెజువెలా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో భారత్ నుంచి ఎగుమతులు 217 మిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 1.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ దిగుమతుల్లో పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్ (POL) వాటానే అత్యధికం. “భారత్ దిగుమతి చేసుకుంటున్న దేశాలతో పోలిస్తే వెనెజువెలా నుంచి వస్తున్న ముడి చమురు యూనిట్ విలువ తక్కువగా ఉంది. ఇది మన దిగుమతి ఖర్చులను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది” అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్తలు చెబుతున్నారు.






