Greenland: గ్రీన్ లాండ్ మీదకొస్తే నాటో అంతమే.. అమెరికాకు డెన్మార్క్ వార్నింగ్..!
వెనెజువెలాలో ప్రభుత్వాన్ని గద్దెదింపిన అమెరికా ప్రభుత్వం.. ఇప్పుడు గ్రీన్ లాండ్ పై ఫోకస్ పెంచింది. గ్రీన్లాండ్ గురించి ఇంకో 20 రోజుల్లో మాట్లాడదామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ (Mette Frederiksen) తీవ్రంగా స్పందించారు. తోటి నాటో దేశంపై అమెరికా దాడి చేస్తే.. మొత్తం సంబంధాలు ఆగిపోతాయని ఆమె స్పష్టం చేశారు. ఇది నాటోకు ముగింపేనన్నారు.
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) ఒక సైనిక కూటమి (NATO). సోవియట్ విస్తరణను అడ్డుకోవడానికి 1949లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, కెనడా సహా 12 దేశాలు కలిసి దీనిని ఏర్పాటుచేశాయి. ఆ తర్వాత దీనిని విస్తరించారు. ప్రస్తుతం 30కి పైగా సభ్యదేశాలు ఉన్నాయి. నాటోలో చేరిన దేశం కూటమి కార్యకలాపాల్లో సైనిక సహకారం అందించడానికి సిద్ధంగా ఉండాలి.
గ్రీన్లాండ్ డెన్మార్క్‌దే అనడానికి ఆధారం ఏమిటీ..?
డెన్మార్క్ ప్రధాని వ్యాఖ్యల వేళ.. ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ స్పందించారు. గ్రీన్లాండ్ డెన్మార్క్‌దే అనడానికి ఆధారం ఏమిటని ప్రశ్నించారు. దానిని నియంత్రణలోకి తీసుకోవడం ద్వారా సైనిక కూటమి, ఆర్కిటిక్ ప్రయోజనాలను అమెరికా (USA) కాపాడుతుందన్నారు. మిల్లర్ సతీమణి కేటీ మిల్లర్ పెట్టిన పోస్టు ఇప్పటికే కలకలం సృష్టించింది. అమెరికా జెండా రంగుల్లో ఉన్న గ్రీన్లాండ్ మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దానికి ‘త్వరలో (SOON)’ అనే పదాన్ని జత చేశారు.






