Trump: త్వరలో అమెరికా ఖజానాకు 600 బిలియన్ డాలర్లు.. టారిఫ్ లను సమర్థించుకున్న ట్రంప్..
ట్రంప్ టారిఫ్ లు అమెరికా ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే టారిఫ్ ల ద్వారా బిలియన్ల డాలర్లు అమెరికాకు చేరుతున్నాయి. లేటెస్టుగా వెనెజువెలాను చేజిక్కించుకోవడం ద్వారా చమురు వ్యాపారంపైనా అమెరికా పట్టు బిగిస్తోంది. ఇదే తరుణంలో అమెరికాకు త్వరలో 600 బిలియన్ డాలర్ల (సుమారు రూ.54 లక్షల కోట్లు) ఆదాయం సమకూరనుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్‌లను సమర్థించుకుంటూ ఈ మేరకు పోస్ట్ పెట్టారు (Trump Tariffs). సుంకాల విషయంలో తాను అనుసరిస్తోన్న విధానాలు దేశాన్ని ఆర్థికంగా, భద్రతపరంగా బలోపేతం చేశాయని వెల్లడించారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి శత్రువు, మిత్రుడు అనే తేడా లేకుండా పలు దేశాలపై టారిఫ్‌ల మోత మోగించారు. రష్యా (Russia) నుంచి ముడిచమురు కొంటుందన్న నెపంతో భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు 50 శాతం సుంకాలు వేసింది. ఒకవైపు రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతోన్న సమయంలో ఈ మోత మోగించింది.
కాగా.. అధ్యక్షుడు విదేశాలపై విధించిన టారిఫ్‌లపై అమెరికా (USA) సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ట్రంప్‌నకు టారిఫ్‌లు విధించే అధికారంపై అక్కడి సుప్రీంకోర్టు సమీక్షించి తీర్పు ఇవ్వనుంది. తీర్పు ఫలితం ఎలా ఉన్నా అందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైట్‌హౌస్ ఇప్పటికే వెల్లడించింది. ‘‘వైట్‌హౌస్ ప్లాన్-బితో సిద్ధంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండకపోవడం అజాగ్రత్తే అవుతుంది. సుప్రీంకోర్టు (US Supreme Court) తీర్పు మాకు సానుకూలంగా వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం’’ అని వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి కరోలిన్ లీవిట్ గతంలో వెల్లడించారు.






