TDF: వాషింగ్టన్ డిసిలో వైభవంగా టిడిఎఫ్ బతుకమ్మ-దసరా సంబరాలు

వాషింగ్టన్ డిసి తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) ఆధ్వర్యంలో 20వ బతుకమ్మ-దసరా సంబరాలు జాన్ చాంపే హై స్కూల్, అల్డీ, వర్జీనియాలో అంగరంగ వైభవంగా జరిగాయి. అమెరికాలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలకు వేలాది మంది తెలుగు ప్రజలు, స్థానికులు హాజరై తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించారు. ఈ వేడుకలకు పద్మభూషణ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని శ్రీమతి కె.ఎస్. చిత్త్ర గారు ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఆమె సమక్షం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే తెలంగాణ జానపద గాయకుడు బిక్షు నాయిక్ తన పాటలతో ప్రేక్షకులను అలరించారు. బతుకమ్మ ప్రదర్శన, జానపద నృత్యాలు, సాంప్రదాయ గీతాలు, దసరా ఉత్సవాలతో వేదిక సందడి చేసింది. మంజుల మద్దికుంట సాంస్కృతిక కార్యదర్శిగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళలు, పిల్లలు, యువత అందరూ చురుకుగా పాల్గొని అబ్బుర పరిచే నృత్యాలు ప్రదర్శించారు.
మహిళలు, పిల్లలు రంగురంగుల బతుకమ్మలతో కార్యక్రమాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. అవంతిక నక్షత్రం మీడియా చైర్ గా రూపొందించిన బతుకమ్మ టీజర్ పలువిరిని అబ్బుర పరచింది. ఈ వేడుకలను మంజుషా నాంపల్లి, రుద్ర భీమ్‌రెడ్డి కన్వీనర్లుగా సమన్వయం చేయగా, పూర్వ అధ్యక్షులు కవిత చల్లా, వినయ సూరినేని, కల్పనా బోయినపల్లి సలహాదారులుగా సహకరించారు.
స్థానిక రెస్టారెంట్ వారిచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత విందు ద్వారా వేల కుటుంబాలు స్నేహభావంతో కలసికట్టుగా భోజనం చేశారు. ఈ సందర్భంగా పలువురు అమెరికాలో ఇంత భవ్యంగా జరుగుతున్న తెలంగాణ ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించడం గర్వకారణమని పేర్కొన్నారు.
స్పాన్సర్లు, వాలంటీర్లు మరియు కమ్యూనిటీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని టిడిఎఫ్ యుఎస్‌ఎ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.