అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ఓట్లే కీలకం

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఈసారి భారతీయుల ఓట్లే అత్యంత కీలకం కానున్నాయి. ఈ విషయాన్ని భారతీయ సంతతికి చెందిన చట్టసభ సభ్యులు రాజా కృష్ణమూర్తి తెలిపారు. అమెరికాలో 20 లక్షల మంది హిందువులు పలు కీలక రాష్ట్రాలలో ఫలితాన్ని మలుపు తిప్పే ఆయుపట్టు వంటి ఓటుగా మారుతారని విశ్లేషించారు. ప్రస్తుత ఎన్నికలలో తోటి భారతీయులు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఇది వారి విద్యుక్త ధర్మంగా భావించుకోవాలని కోరారు. హిందూ అమెరికన్స్ ఫర్ బిడెన్ పేరిట ఏర్పాటు అయిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రధానోపన్యాసం చేశారు. ఇలినోయిస్ నుంచి మూడు పర్యాయాలు డెమోక్రాటిక్ పార్టీ తరపున కాంగ్రెస్‍మెన్‍గా ఉన్న కృష్ణమూర్తి అమెరికాలో భారతీయ ఓటర్లకు నవంబర్ ఎన్నికల దశలో తమ నిర్ణయాత్మక ఓటును సద్వినియోగపర్చుకోవాలని పిలుపు నిచ్చారు.
జో బిడెన్, సభ అభ్యర్థి కమలా హారిస్‍లకు ఓటువేయాలని, ఇది తమ బాధ్యతగా గుర్తుంచుకోవాలని కోరారు. జో బిడెన్‍ను ఎన్నుకోవడం చాలా ముఖ్యమని, వసుధైక కుటుంబం అనే హైందవ విలువలకు దీనితో మరింత విలువ పెరుగుతుందని తెలిపారు. సర్వజనులను గౌరవ మర్యాదలతో చూడటం భారతీయుల లక్షణం అని దీనిని చాటుకునేందుకు ఇప్పటి ఎన్నికలలో సముచిత రీతిలో వ్యవహరించాలని సూచించారు.