అమెరికా అధ్యక్ష ఎన్నికలు… అభ్యర్థుల తొలి ముఖాముఖి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలకఘట్టం ప్రారంభమైంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థుల తొలి ముఖాముఖి చర్చ అత్యంత ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఈ ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పాల్గొన్నారు. ఇరువురు అధ్యక్ష అభ్యర్థుల మధ్య సంధానకర్తగా క్రిస్ వాలెస్ వ్యవహరించారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక విషయమై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై మొదటి ప్రశ్నతో ఈ ముఖాముఖి చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బిడెన్ మాట్లాడుతూ అమెరికాలో ఎన్నికలు ఇప్పటికే ప్రారంభమైనట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికే వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. అనంతరం ట్రంప్ తీసుకొచ్చిన ఆరోగ్య బీమాపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఒబామా కేర్ పాలసీని అధ్యక్షుడు ట్రంప్ నీరుగార్చారని బిడెన్ విమర్శించారు. ట్రంప్ విధానం వల్లే వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. మహమ్మారి కరోనా ఎదుర్కొవడంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఒబామా కేర్ పాలసీ రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. ఆరోగ్య బీమాను రద్దు చేయలేదని ప్రజలకు ఆరోగ్యసేవలను తక్కువ ధరలో అందించే ప్రయత్నం చేశామని అన్నారు. తాము ప్రజలకు కరోనా విషయంలో మెరుగైన వైద్యం అందించామని ఆయన సృష్టం చేశారు. అలాగే ఒబామా కేర్ పాలసీ నిర్వహణ అంతా సులువు కాదని, పెద్ద ఖర్చుతో కూడుకున్నదిగా ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే తాను మాస్క్ ధరించట్లేదనే ఆరోపణలను ట్రంప్ తప్పు పట్టారు. మాస్క్ ఎప్పుడూ తన వెంటే ఉంటుందని చెప్పారు. తన వెంట తెచ్చుకున్న మాస్క్ను ఆయన సంధానకర్తకు చూపించారు. అవసరం ఉంటేనే మాస్క్ ధరిస్తానని అన్నారు. జో బిడెన్ తరహాలో తాను ప్రజలకు 200 మీటర్ల దూరంలో ఉండనని చురకలు అంటించారు. దీనిపై స్పందించిన బిడెన్ ట్రంప్‍కు ఆరోగ్య రంగంపై అసలు అవగాహన లేదని, ఎలాంటి ప్రణాళిక కూడా లేదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో నామామాత్రంగా నిధులను వ్యయం చేశారని అన్నారు. ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి ట్రంప్ ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు లేవని ఆరోపించారు.
అనంతరం మాట్లాడిన ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ 47 ఏళ్ల పాలనలో అగ్రరాజ్యానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. భారత్ సహా ఇతర దేశాల్లో కొవిడ్ వల్ల ఎంతమంది మృతిచెందారో బైడెన్‍కు తెలియదా అని ప్రశ్నించారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక విషయమై మాట్లాడిన ట్రంప్ గత ఎన్నికల్లో గెలిచాం కనుకే సుప్రీంకోర్టు నియామాకాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని అన్నారు. ట్రంప్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని బైడెన్ చెప్పారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోందని సృష్టం చేశారు. తాము అన్ని పారదర్శక విధానాలే అవలంబిస్తున్నామని చెప్పారు.ఇలా ఇరువురు అధ్యక్ష అభ్యర్ధుల మధ్య తొలిముఖాముఖి చర్చ వాడివేడిగా కొనసాగింది. సూపర్ బౌల్ ఆఫ్ అమెరికన్ డెమోక్రసీ అని పిలిచే ఈ కీలక చర్చకు ఒహియోలోని క్లీవ్‍లాండ్ విశ్వవిద్యాలయం వేదిక అయింది. అక్టోబరు 15న ఫ్లోరిడాలోని మియామిలో, 22న టెన్నెసీలోని నష్‍విల్లేలో రెండో, మూడో విడత ముఖాముఖి చర్చలు జరుగనున్నాయి.
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు చెప్పే మాటలే కొన్నిసార్లు వారి భవితవ్యాన్ని కూడా నిర్ణయిస్తాయి.