శ్వేతసౌధానికి చేరిన డొనాల్డ్ ట్రంప్

కరోనా మహమ్మారితో మిలటరీ హాస్పిటల్‍లో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధానికి చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన హాస్పిటల్‍లో చికిత్స తీసుకున్నారు. మరో వారం రోజుల పాటు ఆయనకు వైద్యులు చికిత్స అందించనున్నారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్‍లకు కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో వారు వైట్‍హౌస్‍లో క్వారంటైన్‍లో ఉండగా, వైద్యుల సూచన మేరకు వాల్టర్ రీడ్ సైనిక హాస్పిటల్‍లో చేరారు. నాలుగు రోజుల పాటు హాస్పిటల్‍లో ఉన్న ట్రంప్‍కు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో స్టెరాయిడ్స్ ఇచ్చారు.
అలాగే రెజెనెరాన్స్కు చెందిన 8 గ్రాముల డోసు గల పాలీక్లోనల్ యాంటీబాడీ కాక్‍టెయిల్ ఇచ్చారు. అలాగే జింక్, విటమిన్ డీ, ఫామోనిటిడైన్, ఆస్పిరిన్, మెలటోనిన్ తీసుకున్నారు. పాలీక్లోనల్ యాంటీబాడీ కాక్‍టెయిల్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా ట్రంప్ హాస్సిటల్ నుంచి డిశ్చార్జి అవుతున్నట్లు ట్వీట్ చేశారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కొవిడ్ గురించి ఎవరూ భయపడొద్దని సూచించారు. మన జీవితాల్లో వైరస్ ఆదిపత్యం ప్రదర్శించకుండా అమెరికన్లు చూసుకోవాలని సూచించారు. మహమ్మారి నియంత్రణకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని ట్రంప్ ట్వీట్ చేశారు.