పౌర హక్కుల మహా ప్రదర్శనకు 57 ఏళ్ళు!

సరిగా 57 ఏళ్ల క్రితం పౌర హక్కులపై మార్టిన్ లూథర్ కింగ్ నిర్వహించిన ప్రదర్శన తరహాలోనే శుక్రవారం గెట్ యువర్ నీ ఆప్ ఆవర్ నెక్స్ పేరుతో వాషింగ్టన్‍లో లింకన్ మెమోరియల్ వద్ద ప్రదర్శన జరగనుంది. వేలాదిమంది ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొంటారని భావిస్తున్నారు. మే 25న నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య నేపథ్యంలో సమానత్వం, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రదర్శన జరగనుంది. వర్ణ వివక్షత పెచ్చరిల్లిన సమయంలో, పోలీసుదారుణాలపై పోరు సాగించాల్సిన తరుణంలో మనం ఉన్నామని చరిత్రకారుడు, హార్వర్డ్ యూనివర్సిటీలో డిజిటల్ లైబ్రేరియన్ అయిన లోపెజ్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలపై మరోసారి అందరు దృష్టి పెట్టేందుకు వీలుగా మరో బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించడం సముచితమని ఆయన పేర్కొన్నారు.
జార్జి ఫ్లాయిడ్ హత్యను మరవకముందే జాకబ్ బ్లేక్‍పై దాడి జరగడంతో మరోసారి నిరసనలు మిన్నంటాయి. ఈ ఆందోళనల్లో మంగళవారం ఇద్దరు వ్యక్తులు మరణించారు. హింస, విధ్వంసం, లూటీలు జరగడాన్ని అనుమతించబోమని ట్రంప్ ట్విట్టర్ వేదికగా హెచ్చరిక చేశారు. అవసరమైతే కెనెషాకు అదనపు బలగాలను పంపిస్తామని కూడా ప్రకటించారు. నవంబరులో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ నిరసన ప్రదర్శనలు, ఆందోళన ట్రంప్ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. హక్కులు, సమానత్వం కోరుతూ ఆనాడు నిర్వహించిన ప్రదర్శనకు అర్థశతాబ్దం దాటినా ఈనాటికీ సమానత్వం, వ్యవస్థాగత వర్ణ వివక్షత, పోలీసు నిరంకుశత్వం కొనసాగుతున్నాయని ది రూట్ డిజిటల్ మేగజైన్ ఎడిటర్ ఇన్ ఛీప్ డేనియల్ బెల్టన్ వ్యాఖ్యానించారు.