Piyush Goyal : త్వరలోనే అమెరికాతో ఒప్పందం : పీయూష్ గోయల్

అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయని, నవంబరు కల్లా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) అన్నారు. ముంబైలో జరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల వార్షిక సదస్సు లో గోయల్ మాట్లాడుతూ భారత్‌తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను పెంచుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని అన్నారు. ఈయూ (EU ) తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కూడా చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. అమెరికా(America ) తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే, భారతదేశం ఎప్పుడూ డెడ్‌లైన్స్ పెట్టుకొని వాణిజ్య చర్చలు జరపదని, పరస్పర ప్రయోజనకరంగా ఉండే ఒప్పందాలపై మాత్రమే చర్చలు జరుపుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇండియా సరఫరా వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయని, వేరే ఏ ఇతర దేశ దయాదాక్షిణ్యాలపైనా మనం ఆధారపడి లేమని ఆయన తేల్చిచెప్పారు. చిలీ, పెరు, న్యూజిలాండ్ (New Zealand) , ఆస్ట్రేలియా (Australia) , ఓమన్ వంటి దేశాలతో కూడా కొత్త వాణిజ్య ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.