Maria Corina Machado: స్వేచ్ఛా సమయం ఆసన్నైమైంది..వెనెజువెలా విపక్షనేత మరియా కొరినా మచాడో
వెనెజువెలా పౌరులారా ఊపిరి పీల్చుకోండి. ఈ దేశాన్ని పాలిస్తున్న నియంత బంధీ అయ్యాడు. అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. వెనెజువెలాకు తిరిగి స్వేచ్ఛ వచ్చిందంటూ .. విపక్షనేత మరియా కొరినా మచాడో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మచాడో ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘వెనెజువెలా ప్రజలారా స్వేచ్ఛా సమయం ఆసన్నమైంది. వెనెజువెలా ప్రజలు, ఇతర దేశాల పౌరులపై జరిగిన దారుణమైన నేరాలకు నికొలస్ మదురో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. చర్చలతో సమస్య పరిష్కారానికి అతడు నిరాకరించాడు. దీంతో అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది’ అని మచాడో అన్నారు. ప్రజా సార్వభౌమాధికారంతో వెనెజువెలాను (Venezuela) పాలించే సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని, శాంతియుత భవిష్యత్తును నిర్మించబోతున్నామని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యం కోసం అనేక సంవత్సరాలుగా తాను చేసిన పోరాటం ఫలించిందన్నారు మచాడో. వెనెజువెలా తదుపరి అధ్యక్ష పదవి కోసం ఎడ్మండో గొంజాలేజ్ ఉరుటియాకు తన మద్దతును ప్రకటించారు. శాంతియుతంగా, ప్రజస్వామ్యబద్ధంగా అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటనతో మచాడో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆమె నార్వేలోని ఓస్లోలో ఉన్నట్లు తెలుస్తోంది.
మచాడో మంచి మహిళ.. బాధ్యతలు అప్పగించమన్న ట్రంప్…
మదురో (Nicolas Maduro) నిర్బంధం తర్వాత వెనెజువెలా అధికార బాధ్యతలు అప్పగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకురాలైన మచాడోకు బాధ్యతలు అప్పగించే విషయాన్ని ఆయన తోసిపుచ్చారు. మచాడో చాలా మంచి మహిళ అని.. కానీ ఆమె నాయకురాలిగా ఉండటం చాలా కష్టమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఆమెకు సరైన మద్దతు లేదన్నారు.






