Kavitha: షర్మిల బాటలో కాంగ్రెస్ గూటికి కల్వకుంట్ల కవిత?
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలి వేదికగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తన రాజీనామాను ఆమోదించాల్సిందేనని ఆమె నిండు సభలో పట్టుబట్టడం, మండలి ఛైర్మన్ దాన్ని పునరాలోచించుకోవాలని సూచించడం వంటి పరిణామాలు ఒక పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. అయితే, ఈ రాజీనామా వెనుక కేవలం అసంతృప్తి మాత్రమే ఉందా? లేక దీని వెనుక ఒక భారీ రాజకీయ వ్యూహం దాగి ఉందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శాసనమండలిలో కవిత ప్రవర్తించిన తీరు బీఆర్ఎస్ శ్రేణులను సైతం విస్మయానికి గురిచేసింది. తన రాజీనామా లేఖను ఆమోదించాలని ఆమె ఛైర్మన్ ను కోరగా, తొందరపడవద్దని, నిర్ణయంపై పునరాలోచించుకోవాలని ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. అయినప్పటికీ, కవిత తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేక ఛైర్మన్ సూచన మేరకు వెనక్కి తగ్గుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. కానీ, సభలో ఆమె బీఆర్ఎస్ పార్టీ విధానాలపై, నాయకత్వంపై పరోక్షంగా నిప్పులు చెరిగిన తీరు చూస్తుంటే.. గులాబీ పార్టీతో ఆమె బంధం తెగిపోయినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో కవిత చేసిన ఒక వ్యాఖ్య అత్యంత కీలకమైనది. “వచ్చే ఎన్నికల నాటికి ‘జాగృతి’ ఒక శక్తిగా రూపాంతరం చెందుతుంది, అందరూ ఆశీర్వదించాలి” అని ఆమె కోరడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక సారథిగా ఉన్న తెలంగాణ జాగృతిని ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చే యోచనలో కవిత ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ లో ఇన్నాళ్లుగా ఉన్న అసమ్మతిని, తనకంటూ ఉన్న వ్యక్తిగత క్యాడర్ ను జాగృతి వేదికగా ఏకం చేయడం ఆమె తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది.
కవిత కొత్త పార్టీ పెడతారన్న వార్తల నడుమ.. అత్యంత ఆసక్తికరమైన ప్రచారం విలీనం చుట్టూ తిరుగుతోంది. వైఎస్ జగన్ సోదరి షర్మిల మొదట ‘వైఎస్ఆర్టీపీ’ పేరుతో పార్టీ పెట్టి, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి, ఇప్పుడు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడవబోతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కవిత నేరుగా కాంగ్రెస్ లో చేరడం కంటే, జాగృతిని పార్టీగా మార్చి, ప్రజల్లోకి వెళ్లాక, ఎన్నికల సమయానికి కాంగ్రెస్ లో విలీనం చేయడం వ్యూహాత్మకంగా మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల అటు సొంత బలం నిరూపించుకోవడంతో పాటు, ఇటు కాంగ్రెస్ హైకమాండ్ వద్ద బార్గేనింగ్ పవర్ పెరుగుతుందన్నది అంచనా.
ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కవిత కాంగ్రెస్ లోకి రావచ్చంటూ ఆయన చేసిన ప్రకటన.. తెరవెనుక జరుగుతున్న మంత్రాంగం బయటపడేలా చేసింది. బీఆర్ఎస్ ను, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కవితను ఒక ‘బ్రహ్మాస్త్రం’లా వాడుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కుమార్తెనే కాంగ్రెస్ గూటికి చేరితే.. అది బీఆర్ఎస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాక, ప్రజల్లో ఆ పార్టీ విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీస్తుంది.
మొత్తానికి కవిత రాజీనామా ఎపిసోడ్ కేవలం ఒక పదవికి సంబంధించిన విషయం కాదు. ఇది తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే ఒక భారీ ఆపరేషన్ కు నాందిగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో జాగృతి యాక్టివిటీ పెరగడం, బీఆర్ఎస్ పై కవిత విమర్శల దాడి తీవ్రతరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ రాజకీయ చదరంగంలో కవిత వేసే ఎత్తులు, దానికి కాంగ్రెస్ అందించే సహకారం.. బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదంగా మారే అవకాశాలను కొట్టిపారేయలేం.






