Trump: క్యూబా, మెక్సికో, కొలంబియాలను అమెరికా ఆక్రమిస్తుందా..?
వెనెజువెలాలో నికొలస్ మదురో ప్రభుత్వాన్ని అమెరికా దించేంసింది. అంతేకాదు.. మదురో దంపతులను అమెరికా కోర్టు ముందు విచారణ జరుపుతామన్నారు అధ్యక్షుడు ట్రంప్. దీంతో ప్రస్తుతం వెనెజువెలా.. అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా ట్రంప్ ..లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలను హెచ్చరించారు. (Trump Warns Cuba, Mexico, Colombia) మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మాదకద్రవ్యాలను తయారు చేస్తూ.. అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ఆరోపించారు. అనేక ముఠాలకు కూడా ఈ దేశాలు ఆశ్రయమిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తర్వాత వెనెజువెలా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు.
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆయా దేశాలలోని డ్రగ్స్ ఉత్పత్తి చేసే ప్రయోగశాలపై దాడులు చేయడానికి కూడా వెనుకాడనని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ..ఇతర దేశాల నుంచి అమెరికాకు సరఫరా అవుతున్న డ్రగ్స్‌ను కట్టడి చేయడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో వెనెజువెలా తర్వాత క్యూబా, కొలంబియా వంటి దేశాలపైనా దృష్టి పెట్టే అవకాశం ఉందన్నారు.
అమెరికా వెనెజువెలా అధ్యక్షుడిని బంధించడాన్ని క్యూబా, కొలంబియా, మెక్సికో ఖండించాయి. ఆ దేశంపై యూఎస్ నిర్వహించిన దాడులు దురాక్రమణ కిందకే వస్తాయన్నాయి. ట్రంప్ చర్యలతో తాము కూడా అప్రమత్తమయ్యామని.. వెనెజువెలా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో పేర్కొన్నారు. ఈ విషయంపై ఓఏఎస్ (ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్), ఐక్యరాజ్య సమితిని వెంటనే సమావేశం కావాలని కోరారు.





