Bhogapuram: ఉత్తరాంధ్ర గేట్వేగా భోగాపురం.. సీట్ల సమీకరణాల్లో వేడి చర్చలు..
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Bhogapuram International Airport) నిలవబోతోంది. ఇప్పటికే పనులు చివరి దశకు చేరుకోవడంతో మరో ఆరు నెలల్లో అక్కడి నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో భోగాపురం పరిసర ప్రాంతాల ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ నుంచి రాజకీయాల వరకు అన్నీ ఈ ఎయిర్‌పోర్టు చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం (Nellimarla Assembly Constituency)పై పడింది.
ప్రస్తుతం ఈ నియోజకవర్గం జనసేన పార్టీ (Janasena Party) ఎమ్మెల్యే ఆధీనంలో ఉంది. లోకం మాధవికి (Lokam Madhavi) 2024 ఎన్నికల్లో కూటమి భాగంగా ఈ సీటును కేటాయించారు. అయితే చరిత్రను చూస్తే నెల్లిమర్ల పరిధిలో తెలుగుదేశం పార్టీ (TDP) బలం ఎక్కువగా ఉందన్న వాదన వినిపిస్తోంది. భోగాపురం నియోజకవర్గంగా ఉన్న కాలం నుంచి 2009 తరువాత నెల్లిమర్లగా మారినప్పటికీ, అనేక ఎన్నికల్లో టీడీపీకి అనుకూల ఫలితాలే వచ్చాయి. బలమైన క్యాడర్, స్థిరమైన ఓటు బ్యాంక్ ఈ పార్టీకి ప్రధాన బలం.
ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తిస్థాయిలో పని చేయడం మొదలైతే, ఉత్తరాంధ్రకు వచ్చే ప్రధాని (Prime Minister) అయినా, ఇతర జాతీయ నేతలైనా అక్కడికే దిగాల్సి ఉంటుంది. దాంతో ప్రోటోకాల్ పరంగా నెల్లిమర్ల ఎమ్మెల్యేకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కనుంది. మంత్రి పదవి లేకపోయినా దానికి మించిన గౌరవం, ప్రాభవం ఈ సీటుకు వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో ఈ సీటును తిరిగి తమ వద్ద ఉంచుకోవాలని టీడీపీ భావిస్తోందని సమాచారం.
అదే సమయంలో జనసేనకు విజయనగరం సీటు (Vizianagaram Assembly Seat) ఇవ్వాలన్న ఆలోచన కూడా తెరపైకి వచ్చింది. 2024లోనే ఆ సీటును జనసేన కోరినప్పటికీ, అక్కడ నుంచి పూసపాటి వారసురాలు అదితి గజపతిరాజు (Aditi Gajapathi Raju) పోటీ చేయనున్న కారణంగా కుదరలేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్ (Governor of Goa)గా నియమితులయ్యాక, ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో హైకమాండ్ నిర్ణయమే కీలకమవుతుందని అంటున్నారు.
అయితే మరో కోణంలో చూస్తే నెల్లిమర్లలో తూర్పు కాపులు (Eastern Kapu community) బలమైన సామాజిక వర్గం. గతంలో ఈ వర్గం నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అలాంటి చోట వర్గ సమీకరణలు దెబ్బతింటే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. మొత్తంగా చూస్తే భోగాపురం ఎయిర్‌పోర్టు కారణంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇది అభివృద్ధికి చిహ్నంగా నిలవడమే కాకుండా, కొన్ని రాజకీయ కుటుంబాలకు సవాల్‌గా మారుతుందన్న ఊహాగానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి 2029 ఎన్నికల సమయానికి భోగాపురం కేంద్రంగా కూటమిలో ఎటువంటి లెక్కలు మారుతాయో చూడాలి..






