Venezuela: అమెరికా డాలర్ ఇగోను టచ్ చేసిన వెనెజువెలా అధినేత మదురో.. అందుకే అర్థరాత్రి అరెస్టు..!
అమెరికా .. వెనెజువెలను ఆక్రమించడానికి చెబుతున్న కారణం.. తమ దేశానికి ఆ లాటిన్ అమెరికా దేశం నుంచి పోటెత్తిన మాదక ద్రవ్యాలు.. అసాంఘిక శక్తులు. వాటిని నియంత్రించకపోవడం వల్లే తాము.. వెనెజువెలాపై దాడి చేస్తామని ట్రంప్ సర్కార్ పదేపదే హెచ్చరించింది. చివరకు సమయం చూసి వెనెజువెలాపై దాడికి దిగింది. అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించింది. తమ దేశ కోర్టులో విచారణ జరుపుతామన్నారు ట్రంప్.
నిజానికి ట్రంప్ సర్కార్ , వెనెజువెలాపై దాడి చేయడం వెనక ఉన్న అసలు కారణమేంటి..? పెట్రో డాలర్ ఆధిపత్యం కొనసాగించడం. దీనికోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. అది మంచిదా.. ? చెడ్డదా అనవసరం.. తమ ఆధిపత్యం దెబ్బతినే పరిస్థితి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని అమెరికా మరోసారి ప్రపంచానికి సందేశమిచ్చింది.
అమెరికా వెనిజులాపై దాడి చేయడానికి అసలు కారణం 1974లో సౌదీ అరేబియాతో హెన్రీ కిస్సింజర్ చేసుకున్న ఒప్పందం. ఇది వాస్తవానికి యూఎస్ డాలర్ ఆధిపత్యాన్ని సాదించే దిశగా కుదిరిన ఒప్పందం. ఫలితంగా అమెరికా 50 ఏళ్లుగా ప్రపంచ పెద్దన్నగా ఆధిపత్యం చలాయిస్తోంది. అయితే ఇటీవలికాలంలో వెనెజువెలా.. దాన్ని అంతం చేసే దిశగా పయనిస్తోంది. ఫలితంగా ఓఫైన్ డే చూసుకుని.. అమెరికా దళాలు దాడికి దిగాయి.
వెనిజువెలాలో 303 బిలియన్ బారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి.ఇవి భూమిపైన ఉన్న అతిపెద్ద చమురు నిల్వలు. సౌదీ అరేబియా కన్నా అధికంగా ఇక్కడ చమురు నిక్షేపాలున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే మొత్తం ప్రపంచంలోని చమురులో 20శాతం ఇక్కడే ఉంది. ఆ చమురును వెనెజువెలా డాలర్ కు బదులుగా చైనీస్ యువాన్ లో అమ్మకాలు సాగిస్తోంది.
2018లో, వెనిజులా “డాలర్ నుండి విముక్తి పొందుతామని” ప్రకటించింది.వారు యువాన్, యూరోలు, రూబుల్స్ లో అమ్మకాలు సాగించారు. డాలర్లను నిరాకరించారు. అంతేకాదు..బ్రిక్స్ కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. అంతేకాదు.. SWIFTను పూర్తిగా దాటవేసే ప్రత్యక్ష చెల్లింపు మార్గాలను చైనాతో నిర్మిస్తున్నారు.దశాబ్దాలుగా డీ-డాలరైజేషన్కు నిధులు సమకూరుస్తున్నారు కూడా. దీంతో తమ పాదాల కింద భూమి కదిలే పరిస్థితి రావడంతో ట్రంప్ సర్కార్.. వెనెజువెలా అధినేతతో చర్చలు జరిపింది. అయితే చర్చలు సఫలం కాకపోవడంతో.. బెదిరింపులు చేసింది. వాటికి మదురో తలొగ్గకపోవడంతో సైన్యాన్ని పంపి ఆపరేషన్ నిర్వహించి.. వారిని అరెస్ట్ చేసింది.






