Ro Khanna: లై చింగ్ తెను చైనా.. జెలెన్స్కీని రష్యా నిర్బంధిస్తే..?
వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యపై ప్రపంచదేశాల్లోనే కాదు.. సాక్షాత్తూ అమెరికాలోనూ నిరసన వ్యక్తమవుతోంది. ఇది పూర్తిగా అనాలోచిత చర్యని ..కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ ఆదేశాలతో చేపట్టిన సైనిక చర్యను భారత సంతతికి చెందిన చట్టసభ సభ్యుడు రోఖన్నా తీవ్రంగా తప్పుబట్టారు (Ro Khanna criticised Trump). ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన ధోరణలకు దారి తీస్తాయని హెచ్చరించారు. తాజా దాడులను ఆయన యుద్ధ చర్యగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
వెనెజువెలాలో పాలన మార్పు కోసం ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించి.. మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్)ను మోసం చేశారన్నారు. ఇరాక్, అఫ్గానిస్థాన్, లిబియాలో ఘర్షణలకు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తున్నామన్నారు. కానీ, తమ అధ్యక్షులు మాత్రం.. సైనికీకరణకు అనుకూలంగా ఉండే విదేశాంగలోని కొందరు వ్యక్తుల మాటలకు తలొగ్గుతున్నారని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఈ సందర్బంగా అధ్యక్షుడు ట్రంప్ కు .. ఖన్నా కొన్ని కీలక ప్రశ్నలు సంధించారు. తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ తెను చైనా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా నిర్బంధిస్తే (If Putin captures Zelenskyy?) ఏం చేస్తారని ప్రశ్నించారు. పెరిగిపోతున్న రక్షణ బడ్జెట్లకు, యుద్ధోన్మాద వ్యక్తులకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అమెరికా వ్యవస్థాపకుల సలహాలను పాటిస్తూ.. దేశ ప్రజలకు ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, పిల్లల సంరక్షణ, విద్యలో పెట్టుపడి పెట్టే పాలకులే మనకు అవసరమని వ్యాఖ్యానించారు. ఇక మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్తో సహా అనేక మంది అమెరికన్ చట్టసభ సభ్యులు ట్రంప్ చర్యలను వ్యతిరేకించారు.
తర్వాతి టార్గెట్ పుతినేనా..?
వెనెజువెలాపై మెరుపుదాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) సమర్థించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అరెస్టు గురించి ఆయన ప్రస్తావించారు. యూరోపియన్ జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం అనంతరం జెలెన్స్కీ విలేకరులతో మాట్లాడారు. ‘నియంతలను ఈ విధంగా ఎదుర్కోవడం సాధ్యమైతే.. తర్వాత ఏం చేయాలో అమెరికాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్పై దాడుల పరంపరను కొనసాగిస్తున్న పుతిన్ (Putin)ను కూడా ట్రంప్ ఇలానే హ్యాండిల్ చేయాలని సూచించారు.






