Seema Projects : “జగన్.. ఇదిగో నీ ఘనకార్యం..!” సీమ ప్రాజెక్టులపై నిమ్మల క్లారిటీ
రాయలసీమ కరవును శాశ్వతంగా పారదోలాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్, చంద్రబాబు తదితర నేతలు దార్శనికతతో రూపకల్పన చేసిన సాగునీటి ప్రాజెక్టులు, గత ఐదేళ్ల పాలనలో ఎలా నిర్లక్ష్యానికి గురయ్యాయో వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు “సీమ సాగునీటి ప్రాజెక్టుల చరిత్ర – వర్తమానం” పేరిట దీన్ని విడుదల చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్వహణ లోపాలు, అనుమతులు లేని పనుల పేరుతో జరిగిన ప్రజాధనం వృథా, ప్రాజెక్టుల దుస్థితిని గణాంకాలతో సహా ఇది కళ్ళకు కట్టింది.
తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులకు గతంలోనే పునాదులు పడినప్పటికీ, 2019-2024 మధ్య కాలంలో ఈ ప్రాజెక్టులు పడకేశాయని ప్రభుత్వం ఆరోపించింది. ముఖ్యంగా హంద్రీ-నీవా ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రభుత్వం ఎత్తిచూపింది. 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో పంప్ హౌస్‌లు సిద్ధంగా ఉన్నప్పటికీ, కాల్వల పనులు పూర్తి చేయకపోవడం, విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆ ఐదేళ్లలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరందించలేకపోయారని తెలిపింది. 2019-24 మధ్య కేవలం రూ.514 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే రూ.3,145 కోట్లు వెచ్చించి పనులు పరుగులు పెట్టిస్తోందని తెలిపింది. ఫలితంగా నేడు 735 కిలోమీటర్ల దూరంలోని పరమసముద్రం, మడకశిర ప్రాంతాలకు కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని పేర్కొంది.
పర్యావరణ అనుమతులు, సరైన ప్రణాళిక లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఖజానాకు భారీ గండి పడిందని ప్రభుత్వం వెల్లడించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో హడావుడి చేసి, అనుమతులు రాకముందే రూ.990 కోట్లు ఖర్చు చేశారని, చివరికి ఎన్జీటీ (NGT) మొట్టికాయలు వేసి ప్రాజెక్టును నిలిపివేయడంతో ఆ డబ్బంతా వృథా అయ్యిందని పేర్కొంది. పైగా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.2.65 కోట్ల జరిమానా, రూ.750 కోట్ల అప్పులు మిగిలాయని తెలిపింది. అలాగే ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల విషయంలోనూ ఇదే తంతు జరిగిందని, భూసేకరణ లేకుండానే కాంట్రాక్టర్లకు కోట్లు చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది.
ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేయడం వల్ల జరిగిన అనర్థాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించింది. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల నిర్వహణలో వైఫల్యం కారణంగా ఆనకట్ట తెగిపోయి 39 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని గుర్తు చేసింది. అలాగే పింఛ ప్రాజెక్టు డ్యామేజ్, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్ట దెబ్బతినడం, గోరకల్లు, ఆవుకు రిజర్వాయర్ల భద్రతను విస్మరించడం వల్ల రైతాంగానికి నీరందని పరిస్థితి నెలకొందని వివరించింది.
మరోవైపు, విపత్తులను ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోందన్న దానికి తుంగభద్ర గేటు ఉదంతాన్ని ఉదాహరణగా చూపింది. తుంగభద్ర డ్యామ్ 19వ క్రెస్ట్ గేటు కొట్టుకుపోయినప్పుడు, సీఎం చంద్రబాబు చొరవతో కేవలం 5 రోజుల్లోనే స్టాప్-లాగ్ గేట్లను అమర్చి 40 టీఎంసీల నీటిని సముద్రం పాలవ్వకుండా కాపాడామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రూ.54 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన కొత్త గేట్ల నిర్మాణం జరుగుతోందని, శ్రీశైలం సహా ఇతర ప్రాజెక్టుల మరమ్మతులకు వందల కోట్లు కేటాయించామని పేర్కొంది.
ప్రస్తుతం సీమలోని జలాశయాల్లో 86 శాతం మేర (288.32 టీఎంసీలు) నీటి నిల్వలు ఉన్నాయని తెలిపిన ప్రభుత్వం, భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించింది. గోదావరి జలాలను రాయలసీమకు మళ్లించడమే ఏకైక లక్ష్యమని స్పష్టం చేసింది. పోలవరం-నల్లమల సాగర్ లింక్ ద్వారా గోదావరి వరద జలాలను తరలించి, బొల్లపల్లి రిజర్వాయర్‌లో 173 టీఎంసీలు నిల్వ చేయడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ప్రభుత్వం తన విజన్‌ను ఆవిష్కరించింది.
మొత్తంగా, ఈ నివేదిక ద్వారా కూటమి ప్రభుత్వం రెండు విషయాలను స్పష్టం చేసింది. ఒకటి గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పడం, రెండు… న్యాయపరమైన చిక్కులు, ఆర్థిక భారం ఉన్నప్పటికీ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సీమ కష్టాలు తీరుస్తామని భరోసా ఇవ్వడం. ఈ నివేదిక ద్వారా రాయలసీమ ద్రోహి జగనేఅని చెప్పే ప్రయత్నం చేసింది ప్రభుత్వం.






