Pittsburgh: పిట్స్‌బర్గ్‌లో ఘనంగా శ్రీ వేంకటేశ్వర అష్టాక్షరీ మంత్రహోమం

పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌లో ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (Sri Venkateswara Swamy Temple) హిందూ అమెరికన్లకు ఎంతో ముఖ్యమైన ప్రాంతంగా పేరుగాంచింది. పిట్స్ బర్గ్ (Pittsburgh)కు 1972లో వచ్చిన కొందరు హిందువులు పొంగల్ పండుగ సమయంలో ఓ చోట చేరి స్క్విరెల్ హిల్‌లో ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవడం ప్రారంభించారు. 1975 లో, శ్రీ వెంకటేశ్వర ఆలయ సంస్థ ఏర్పాటై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంకోసం 1975 ఏప్రిల్ 17 న భూమి పూజ నిర్వహించి, జూన్ 8, 1977న ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రతిష్టించారు. తిరుపతి తరహాలో దక్షిణ భారత వైష్ణవ శైలితో ఈ ఆలయం నిర్మితమైంది. అమెరికాలో భారతీయులు నిర్మించిన మొట్టమొదటి సాంప్రదాయ హిందూ ఆలయంగా ఈ ఆలయం పేరుగాంచింది. 2005లో ఆలయాన్ని మరిన్ని సౌకర్యాలు కల్పించారు. నేడు ఈ ఆలయంలో ఎన్నో సేవలు, కార్యక్రమాలు దక్షిణభారతదేశంలో జరిగే పూజా కార్యక్రమాలన్ని ఇక్కడ జరిగేలా ఏర్పాటు చేశారు. ఈ ఆలయ ఏర్పాటులో, సంప్రదాయాలను నిలబెట్టడంలో మరియు కార్యక్రమాలను నిర్వహించడంలో మహిళలు ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఈ ఆలయంలో ఎన్నో సేవలు, కార్యక్రమాలను అత్యంత భక్తితో, సంప్రదాయబద్దంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర అష్టాక్షరీ హోమం
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జూలై 31 నుంచి ఆగస్టు 3 వరకు శ్రీ వేంకటేశ్వర అష్టాక్షరీ హోమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర పూజను జరిపారు. పవిత్రమైన నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమాలకు ఎంతోమంది భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజైన గురువారం జూలై 31న వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, నిత్యారాధన, ఉత్సవ మూర్తి అభిషేకం, నవ కలశ స్నపనం, శ్రీ గణేశ హోమం, శ్రీ గణేశ అభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం కల్యాణోత్సవం జరిగింది.
సాయంత్రం అంకురార్పణం, నిత్యారాధన కార్యక్రమాలు, విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, ఆచార్య ఋత్విక్ వరణం, రక్షా బంధనం, మృత్తికా సంగ్రహణం వంటి కార్యక్రమాలను జరిపారు. శ్రీ సుదర్శనస్వామి యాగశాల ప్రవేశ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. యాగశాల సంప్రోక్షణం, వాస్తు హోమం, కుంభ అధివాసం, చివరగా శాత్తుమురై, తీర్థ ప్రసాదం వినియోగం జరిగింది.
రెండవ రోజు (ఆగస్టు 1) కూడా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 8:00 గంటలకు సుప్రభాతం, గోమాత పూజ, నిత్యారాధన, యాగశాలకు ఉత్సవ మూర్తి ఊరేగింపు, సంకల్పం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వేదం / దివ్య ప్రభంద పారాయణం చేశారు. ద్వార తోరణ, మహా కుంభ, ఉపకుంభ -ఆరాధన, అగ్ని ప్రతిష్ట, శ్రీ అష్టాక్షరీ హోమం ప్రారంభించారు. తరువాత పూర్ణాహుతి జరిగింది. వేద విన్నపం, శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర పూజలను జరిపారు. మధ్యాహ్నం కల్యాణోత్సవం (యాగశాల) జరిగింది. పలువురు భక్తులు ఇందులో పాల్గొన్నారు. సాయంత్రం సంకల్పం, విశ్వక్సేన పూజ,
వేదం / దివ్య ప్రభంద పారాయణం, ద్వార తోరణ, మహా కుంభ, ఉపకుంభ ఆరాధన, శ్రీ అష్టాక్షరీ హోమం చేశారు. తరువాత పూర్ణాహుతి జరిగింది. వేద విన్నపం, శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర పూజలను జరిపారు. సాయంత్రం గరుడ వాహన సేవ జరిపారు.
మూడవ రోజు – శనివారం ఆగస్టు 2న కూడా వివిధ కార్యక్రమాలను జరిపారు. ఉదయం 8:00 గంటలకు సుప్రభాతం, నిత్యారాధన, యాగశాలకు ఉత్సవ మూర్తి ఊరేగింపు, సంకల్పం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వేదం / దివ్య ప్రభంద పారాయణం, ద్వార తోరణ, మహా కుంభ, ఉప కుంభ -ఆరాధన వంటి కార్యక్రమాలు జరిగాయి. శ్రీ అష్టాక్షరీ హోమం చేశారు. తరువాత పూర్ణాహుతి జరిగింది. వేద విన్నపం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర పూజలను జరిపారు. తరువాత తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. మధ్యాహ్నం యాగశాల వద్ద కల్యాణోత్సవం చేశారు. సాయంత్రం సంకల్పం, విశ్వక్సేన పూజ, సంకల్పం, వేదం / దివ్య ప్రభంద పారాయణం, ద్వార తోరణ, మహా కుంభ, ఉపకుంభ ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ అష్టాక్షరీ హోమం మధ్యాహ్నం 3 నుంచి 5వరకు జరిగింది. పూర్ణాహుతి, తరువాత వేద విన్నపం, శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర పూజలను జరిపారు. సాయంత్రం పుష్ప పల్లకి సేవ జరిగింది.
4వ రోజు -ఆగస్టు3వ తేదీన కూడా వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 7:00 గంటలకు సుప్రభాతం, నిత్యారాధన, యాగశాలకు ఉత్సవ మూర్తి ఊరేగింపు, సంకల్పం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వేదం / దివ్య ప్రభంద పారాయణం, ద్వార తోరణ, మహా కుంభ, ఉప కుంభ -ఆరాధన వంటివి చేశారు. శ్రీ అష్టాక్షరీ హోమం తరువాత, మహా పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది. వేదవిన్నపం, ఆచార్య రుత్విక్ సన్మానం, శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర పూజలను జరిపారు. మధ్యాహ్నం మహామండపం వరకు ఉత్సవ మూర్తి ఊరేగింపు, మూలవర్ అభిషేకం, స్వర్ణ పుష్ప అర్చన, కల్యాణోత్సవం జరిపారు.
ఈ 4రోజులపాటు వైభవంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర అష్టాక్షరీహోమంలో పాల్గొన్న భక్తులకు, పండితులకు, వలంటీర్లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.