Iskcon Temple: అమెరికాలో టార్గెట్ ఇస్కాన్.. తక్షణమే చర్యలు తీసుకోవాలన్న ఇండియా

San Francisco: అమెరికాలో మరోసారి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే ఉతాహ్ లోని స్పానిష్ ఫోర్క్ లోఉన్న ఇస్కాన్ శ్రీశ్రీ రాధాకృష్ణ దేవాలయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల విద్వేషంతో కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. రాత్రి పూట భక్తులు, అతిథులు ఆలయంలో ఉండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆలయానికి తీవ్రంగా నష్టం జరిగింది. ఆలయ తోరణాలు, గోడల్లోకి సుమారు 20 నుంచి 30 బుల్లెట్ల దూసుకెళ్లాయి. గతంలో సైతం ఈ ఆలయంపై దాడులు జరిగాయి. ఈ విషయాన్ని ఇస్కాన్ ఆలయం సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసింది. విద్వేషంతోనే ఈ దాడులు జరిగినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపింది.
గత నెలలో మూడు సందర్భాల్లో ఈ గుడిపై కాల్పులు జరిగినట్లు దేవాలయ అధ్యక్షుడు వాయ్ వార్డెన్ తెలిపారు. స్వాగత తోరణాలు, గోడలు, కిటికీల్లో బుల్లెట్లు దిగాయన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని, అయితే ఇటీవల అకస్మాత్తుగా కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 1990 ప్రారంభంలో ఈ గుడిని నిర్మించారు.
ఈ ఏడాది మార్చి 9న సైతం కాలిఫోర్నియాలో ఇలాంటి ఘటనే జరిగింది. లాస్ ఏంజెలెస్‌లో ఖలిస్థానీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ముందు చినోహిల్స్‌లో ఉన్న బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బాప్స్) హిందూ దేవాలయంపై దాడి జరిగినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
అమెరికాలోని శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్ (Iskcon) దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘‘ఉతాహ్‌లోని స్పానిష్ ఫోర్క్‌లో ఉన్న ఇస్కాన్ శ్రీశ్రీ రాధా కృష్ణ దేవాలయంపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. భక్తులకు, ఆలయ అధికారులకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. ఈ ఘటనపై స్థానిక అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి’’ అని పేర్కొంది.