Frisco: ఫ్రిస్కోలో ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాకుంభాభిషేకం
టెక్సాస్‌లోని ఫ్రిస్కో (Frisco) లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం (Karya Siddhi Hanuman Temple) లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మహా కుంభాభిషేకం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఆగస్టు 4 నుంచి 11వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. ఆగస్టు 9వ తేదీన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహా కుంభాభిషేకం వైభవంగా జరిగింది. పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా మరకత కార్యసిద్ధి హనుమంతుడికి శ్రీ చక్ర పూజ, అభిషేకం నిర్వహించారు. శ్రీ స్వామీజీ ఆలయంలోని వివిధ దేవతలకు ధర్మకర్తలను నియమించారు. శ్రీ స్వామీజీ ప్రతిష్ఠ హోమాలకు మహా పూర్ణాహుతి చేసి, యాగశాల నుండి పవిత్ర జలంతో కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. శ్రీ స్వామీజీ ఆలయానికి చేరుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి దేవికి కుంభాభిషేకం చేసి, ఆలయ శిఖరం నుండి తన ప్రసంగంతో భక్తులను ఆశీర్వదించారు. శ్రీ స్వామీజీ, రుత్వికులతో కలిసి, దేవతల ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి మొదటి అర్చన, మొదటి హారతి మరియు మహా నివేదనలు సమర్పించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాల్గొన్న యజమానులను, పూజారులను, శిల్పులను మరియు సహాయక సిబ్బందిని శ్రీ స్వామీజీ ఆశీర్వదించారు.
ఆరోజు సాయంత్రం, శ్రీ స్వామీజీ భక్తులను అద్భుతమైన దివ్య నామ సంకీర్తనతో ఆశీర్వదించి, శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామికి హారతి అర్పించారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు.
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర దేవాలయం మందిరాన్ని దక్షిణ భారతదేశంలోని ఆలయ నిర్మాణ శైలికి అనుగుణంగా నిర్మించారు. కనువిందు చేసే శిల్పాలు, గోపురాలు భక్తులను ఆకర్షిస్తాయి. భక్తిని, సంప్రదాయాలను తెలియజేసేలా ఆలయ నిర్మాణం జరిగింది.
– మంజరి చెన్నూరి







