లగ్జరీ హౌస్ ల పైనే కొనుగోలుదారుల చూపు

గతంలోకన్నా ఇప్పుడు ఇళ్ళ కొనుగోలు దారుల ఆలోచనలు వేగంగా మారిపోతున్నాయి. కరోనా తరువాత తాము కొనుగోలు చేసే ఇళ్ళు ఇలా ఉండాలని, అవసరమైతే డబ్బులు ఎక్కువైనా ఫర్వాలేదని అనుకునేలా ఆలోచనలు కనిపిస్తున్నాయి. దాంతో గతంలో అందుబాటు ధరలో ఇళ్ళ కన్నా తమ ఆలోచనలకు తగ్గట్టుగా, లగ్జరీ ఉన్న ఇళ్ళపైనే వారు మక్కువ చూపిస్తున్నారు. లెక్క ఎక్కువైనా పర్లేదు.. లగ్జరీ మాత్రం మిస్ అవ్వకూడదనేలా ఆలోచిస్తున్నారని సీఐఐ-అనరాక్ కన్జ్యూమర్ సర్వే తెలిపింది. ఈ క్రమంలో దసరా సందర్భంగా పలు బ్యాంకులు హోం లోన్లపై వడ్డిరేట్లతో పాటు స్టాంప్ డ్యూటీ రుసుము తగ్గించడంతో భారీ ఎత్తున ఇళ్ల కొనుగోళ్లు జరిగినట్లు తేలింది. ముఖ్యంగా లగ్జరీ, సెమీ లగ్జరీ సెగ్మెంట్‌లో వందల కోట్ల బిజినెస్ జరిగినట్లు మరో సర్వే సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి చిరకాల కోరిక. జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బులతో కలల పొదరిల్లును నిర్మించుకోవాలని అనుకుంటారు. అలాంటి పొదరిల్లును ముంబై మహానగరంలో ఎంతమంది సొంతం చేసుకున్నారనే అంశంపై నైట్ ఫ్రాంక్ ఇండియా స్టడీ చేసింది. ఈ స్టడీలో దసరా నవరాత్రి సందఠరేగా ముంబైలో ప్రతి రోజు 400కి పైగా అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకే హోంలోన్లను ఆఫర్ చేయడంతో అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 15 మధ్యకాలంలో రియల్టీ ఎక్స్‌పర్ట్స్ అంచనాల్ని తల్లకిందులు చేస్తూ సుమారు 3,205 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తన స్టడీలో పేర్కొంది. ఇక ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దసరా పండుగ మధ్య కాలంలో ప్రతి రోజు 219 నుంచి 260 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్పష్టం చేసింది. ఆగస్ట్ నెలకంటే అక్టోబర్ 13 వరకు ఇళ్ల సేల్స్ 17శాతం పెరిగాయి. అక్టోబర్ మొదటి రెండు వారాల్లో 4,052 యూనిట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా స్టడీ నిర్ధారించింది.