Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం

మహాకుంభాభిషేక కలశ సంప్రోక్షణ క్రతువును వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం(Kaleshwaram)లోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానంలో నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆదివారం ఉదయం 10:42 గంటలకు తుని తపోవనం పీఠాథిపది సచ్చిదానంద సరస్వతీ స్వామి చేతుల మీదుగా ప్రధాన ఆలయ గోపురం కలశానికి మహాకుంభాభిషేకం (Mahakumbhabhishekam) చేశారు. అనంతరం మంత్రపుష్పం నిర్వహించారు. ఒకే సమయంలో దేవస్థానం తూర్పు రాజగోపురంతోపాటు ఇతర గోపురాలు, అనుబంధ ఆలయాలకు కుంభాభిషేక సంప్రోక్షణను వేదపండితులు చేపట్టారు.
పూజా కార్యక్రమాలన్నీ ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తి (Krishnamurthy) దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. 42 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఈ మహాకుంభాభిషేక ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఈ మహాత్సవంలో మంత్రులు కొండా సురేఖ(Konda Surekha), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Sridharbabu), పొన్నం ప్రభాకర్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలాజారామయ్యర్, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే పాల్గొన్నారు.