Vijayashanti: హింసపెట్టి నా పార్టీ విలీనం చేసుకున్నారు: విజయశాంతి

తెలంగాణలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి (Vijayashanti).. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. “ఎమ్మెల్సీగా నేను బీఆర్ఎస్, బీజేపీ నేతల బండారాన్ని బయటపెడతానని వారికి భయం అవుతోందా? నా వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందని భయపడుతున్నారా?” అని ప్రశ్నించారు. తన పార్టీని విలీనం చేయించుకుని ఆ తర్వాత మోసం చేశారని.. పరోక్షంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మండిపడ్డారు. “విజయశాంతికి, తెలంగాణకి సంబంధం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నాకు, తెలంగాణకు సంబంధం లేదా? నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్.. టీడీపీలో ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ (KCR) సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి నేను చేశాను,” అని ఆమె (Vijayashanti) చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సమయంలో కేసీఆర్ (KCR) పార్లమెంటులో కూడా లేరని, కేసీఆర్ తన దొరబుద్ధిని నిరూపించుకుంటున్నారని ఆమె విమర్శించారు. “దొరలు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా? నింద వేయడం కాదు, నిరూపించాలి. నేను గట్స్ ఉన్న మహిళను,” అని ఆమె (Vijayashanti) అన్నారు. ప్రతిరోజూ తనను అవమానించేవారని, హింసపెట్టి తన పార్టీని విలీనం చేయించుకున్నారని ఆమె ఆరోపించారు. “ఇద్దరి ఆశయం తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు రెండు పార్టీలు ఎందుకని అనుకున్నాం. ఏడు లక్షల కోట్ల అప్పు ఎలా అయ్యిందో విడిచిపెట్టకుండా కేసీఆర్‌ని అడగాలి. కేసీఆర్ మోసాలన్నీ బయటకి తీయాలి. ఆయన ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. మేం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది,” అని ఆమె (Vijayashanti) ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ గురించి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యతిరేకులను రాష్ట్రంలో దించేందుకు బీజేపీ (BJP) ప్రయత్నిస్తోందని ఆమె హెచ్చరించారు. “బాంచన్ కాళ్లు మొక్కుతా అనే పరిస్థితికి మళ్లీ తెలంగాణను తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ వ్యతిరేకి అయిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలోకి తీసుకున్నారు. అందుకే నేను ఆ పార్టీని వదిలేశాను,” అని ఆమె (Vijayashanti) వెల్లడించారు.