Sai Kumar: సినీనటుడు సాయికుమార్‌కు వారధి ఎక్స్‌లెన్స్ అవార్డు

ప్రముఖ నటుడు సాయికుమార్(Sai Kumar)ను తెలంగాణ గవర్నర్(Governor) జిష్ణుదేవ్ వర్మ ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర (ఎఫ్‌టీఏ ఎం), తెలంగాణ-ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఏఎంసీసీఐ) ఆధ్వర్యంలో ‘వారధి’ పేరిట నిర్వహించిన సాంస్కృతికోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సినీనటుడు సాయికుమార్‌కు వారధి ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ కాలం నుంచే తెలుగువారు, మహారాష్ట్ర వాసుల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని.. మహారాష్ట్ర అభివృద్ధిలో తెలుగువారి పాత్ర గణనీయమైందని అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర (ఎఫ్‌టీఏఎం), తెలంగాణ-ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఏఎం సీసీఐ) ఆధ్వర్యంలో ‘వారధి’ పేరిట సాంస్కృతి కోత్సవం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా టీఏఎంసీసీఐ లోగోను గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రతో తెలుగువారికి ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం మహారాష్ట్ర రాజ్య తెలుగు సాహిత్య అకాడమీని స్థాపించిందని తెలిపారు.
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ మాట్లాడుతూ.. ‘తెలుగు వారికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మహారాష్ట్రతోనూ వందల సంవత్స రాల అనుబంధం ఉంది. శివాజీ సైన్యంలో కీలక భూమిక పోషించారు. ముంబయి నిర్మాణంలో తెలుగువారి పాత్ర కీలకమైంది. ప్రస్తుతం పలు ట్రిలియన్ డాలర్ల కంపెనీలకు తెలుగువారు సీఈవోలుగా ఉన్నారు. ఫార్మా, బయోటెక్నాలజీ.. ఇలా అన్నిరంగాల్లో ముందున్నాం. మనవాళ్లు ఎక్కడున్నా.. వారికి తెలుగు రాష్ట్రాలు అండగా ఉంటాయనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.
ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగువారు పారిశ్రామికంగా ఎదగడానికి అవసర మైన నైపుణ్యాన్ని అందించడానికి టీఏఎంసీసీఐ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమన్నారు.
సాయికుమార్ సినీరంగంలో ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన సేవను గుర్తిస్తూ ఈ అవార్డును ఆయనకు బహుకరించారు. కార్యక్రమంలో టీఏఎంసీసీఐ ప్రతినిధులు ఐఆర్‌ఎస్ అధికారి జీవన్‌లాల్ లవీదియా, గురవారెడ్డి, గంజి జగన్‌బాబు, ఎఫ్‌టీఏఎం ఛైర్మన్ డా. పీవీ రమణ, ఏఎన్‌ఎస్ సీహెచ్ ఛైర్మన్ ఏవీ గుప్తా, ప్రధాన కార్యదర్శి అశోక్ కంతే, కోశాధికారి సుభాష్ మచ్చా, భాజపా నేత ప్రేమేందర్‌రెడ్డి, ఎఫ్‌టీఏఎం ప్రతినిధి లౌక్య, సాహితీవేత్త బిక్కి కృష్ణ పాల్గొన్నారు.