Tribal students: జాతీయ క్రీడా పోటీల్లో గిరిజన విద్యార్థుల సత్తా
ఒడిశాలోని రవూర్కెలాలో జరిగిన నాలుగో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్ఎస్) జాతీయ క్రీడా మహోత్సవంలో రాష్ట్ర గిరిజన విద్యార్థులు (Tribal students) అదరగొట్టారు. 36 బంగారు, 42 వెండి, 40 కాంస్య పతకాలు కలిపి మొత్తం 118 పతకాలు సాధించి సత్తా చాటారు. ఖోఖో ( Khokho) అండర్ -19 విభాగంలో బంగారు పతకాన్ని పొందారు. ఇదే కేటగిరీలో వాలీబాల్ (Volleyball) ఆటలో బాలురు, బాలికలు వేర్వేరుగా వెండి పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఆర్ఎస్ (EMRS) పాఠశాలల నుంచి గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి 210 మంది బాలికలు, 218 మంది బాలురు మొత్తం 20 ఈవెంట్లలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రతిభ చూపడం పట్ల గిరిజన గురుకుల సొసైటీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.






