Mahesh Kumar Goud : ఇప్పటి వరకు ఏ రాష్ట్రము చేయని ప్రయత్నం.. తెలంగాణ చేసింది

కాంగ్రెస్‌లో ఎంతటివారైనా పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనని, పార్టీ నియామాలు పాటించని వారిపై చర్యలు ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీసీసీ కమిటీలో 50-60 శాతం ఎస్సీ (SC), ఎస్టీ(ST), బీసీ(BC)లు ఉంటారని తెలిపారు. మెజార్టీలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయంగా న్యాయం జరగటం లేదన్నారు. కులగణన సర్వే కోసం బీసీ సంఘాలు చాలా ఏళ్లు ఎదురుచూశాయి. గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని అభినందించాలి. భవిష్యత్‌లో జరిగే జనాభా గణనలోనూ కులగణన అంశాన్ని చేర్చాలి. కేంద్రం చేసే జనగణనలో కులగణన కూడా చేస్తానని బీజేపీ (BJP) చెప్పాలి. రాష్ట్రంలో 3.66 శాతం మంది మాత్రమే సర్వేలో పాల్గొనలేదు. వివరాలు ఇవ్వనివారు హైదరాబాద్ (Hyderabad)లోనే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ చేయని ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసింది. చేసిన వారిని అభినందించాల్సింది పోయి దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.