Gaddam Prasad Kumar: తెలంగాణను గ్లోబల్ వేదికపై నిలబెట్టడమే లక్ష్యం: స్పీకర్ ప్రసాద్ కుమార్
తెలంగాణను ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వికారాబాద్ కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగురవేసి, ప్రసంగించారు. ఆగస్టు 15కు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వేచ్ఛ లభించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందించిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 2023 డిసెంబర్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం గత ఏడాదిన్నరలో రూ. 1.13 లక్షల కోట్లు ఖర్చు చేసిందని స్పీకర్ (Gaddam Prasad Kumar) తెలిపారు. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించిన రైతు రుణమాఫీ పథకం కింద 25.35 లక్షల మంది రైతులకు రూ. 20,616 కోట్ల రుణమాఫీ చేసి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో రూ. 849 కోట్ల రుణమాఫీ ద్వారా 1,00,358 మంది రైతులకు లబ్ధి చేకూరిందని ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతు సంక్షేమం విషయంలో రాజీ పడలేదని ఆయన ప్రశంసించారు.







