Suchata Opal: ట్రెండింగ్ లో మిస్ వరల్డ్ 2025 సుచాత ఓపల్..

ఇంతకూ థాయ్ ముద్దుగుమ్మ గురించి మీకేమి తెలుసు..?
ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులను అధిగమించిన థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ (Opal Suchata Chuangsri) 72వ ‘మిస్ వరల్డ్ 2025’ (Miss World 2025) కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఇటీవలే మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ 2025ను గెలిచుకున్న ఆమె తాజా పోటీల్లోనూ తన అందం, అభినయం, ప్రతిభతో ప్రపంచ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె నేపథ్యాన్ని పరిశీలిస్తే..
థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో పుట్టి పెరిగారు సుచాతశ్రీ. బ్యాంకాక్‌లోని త్రియం ఉదోమ్ సుక్సా పాఠశాలలో చదువుకున్న ఆమె.. థాయ్, ఇంగ్లీష్‌తోపాటు చైనీస్ భాషలోనూ ప్రావీణ్యం సంపాదించారు. దీంతో వివిధ దేశాల సంస్కృతీ, సంప్రదాయాలపై మక్కువ పెంచుకున్నారు. ప్రస్తుతం థమ్మసాట్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అభ్యసిస్తూ.. అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి సారించారు. వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు మోడలింగ్, అందాల పోటీల్లో పాల్గొనడమన్నా ఇష్టం.
ఈ ఇష్టంతోనే 2021లో ‘Miss Rattanakosin’ పోటీల ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. అయినా ఆమెకు ఆ పోటీల్లో చోటు దక్కలేదు. అలాగని ఆమె అధైర్య పడలేదు. 2022లో తన 18వ ఏట ‘మిస్ యూనివర్స్ థాయ్‌ల్యాండ్’ పోటీల్లో పాల్గొని రెండో రన్నరప్‌గా నిలిచారు. దీంతో తనలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇక 2024లోనూ ‘మిస్ యూనివర్స్ థాయ్‌ల్యాండ్’ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో విజయం సాధించడమే కాదు.. ‘మిస్ ఛార్మింగ్ ట్యాలెంట్’, ‘మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్’.. వంటి సబ్ టైటిళ్లూ గెలుచుకున్నారు.
క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడి
సుచాతకు 16 ఏళ్ల వయసున్నప్పుడు రొమ్ములో కణితి ఉన్నట్లు తేలింది. అయితే, అది క్యాన్సర్ కాదని, దాంతో ప్రమాదమేమీ లేదని తేలడంతో పెద్ద గండం గట్టెక్కినట్లయింది. భవిష్యత్‌లో క్యాన్సర్‌గా రూపాంతరం చెందకుండా దానిని తొలగించినప్పటికీ.. క్యాన్సర్‌తో బాధపడే వారి పరిస్థితి ఏంటని ఆమె మదిలో ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకే ఈ వ్యాధిపై అవగాహన పెంచాలని భావించి..‘ ఓపల్ ఫర్ హెర్’ (Opal For HER) అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించి.. తొలి దశలోనే దాన్ని గుర్తించేలా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం. క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు నిధుల సేకరించడంతోపాటు, కొన్ని సంస్థలతో కలిసి పని చేస్తున్నారు.