SIT: కేటీఆర్ కు సిట్ పిలుపు
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు సిట్ (SIT) 160 సీఆర్పీసీ కింద నోటీసు జారీ చేసింది. విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తమ కార్యాలయానికి రావాలని ఏసీపీ పి.వెంకటగిరి (P. Venkatagiri) సూచించారు. ఈ నెల 20న ఇదే కేసులో హరీశ్‌రావు (Harish Rao)ను విచారించగా, తాజాగా కేటీఆర్‌కు నోటీసు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది. కేసు దర్యాప్తునకు ఉపకరించే అంశాలతో మీకు సంబంధమున్న నేపథ్యంలో వివరాలు వెల్లడించేందుకు విచారణకు రావాలి అని సూచించింది. బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో ఎసఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట ఠాణాలో నమోదైన కేసును ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ నేతత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది.






