Minister Ponnam: ఎన్ఫోర్స్మెంట్ ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలు : మంత్రి పొన్నం
రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రి రవాణాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ సమావేశంలో అధికారులకు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ (Enforcement) విభాగాన్ని పటిష్టం చేసి, నిరంతరం తనిఖీలు చేపట్టేవిధంగా ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ను రూపొందించిందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. ఓవర్‌లోడ్ (Overload) తో వెళ్లే, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలకు అదనపు పెనాల్టీతోపాటు వాటిని సీజ్ చేసేలా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గత నెలలో రద్దయిన చెక్‌పోస్టుల (Checkpoints) వద్ద పనిచేసిన సిబ్బందిని కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేసేలా ఆదేశాలు జారీ చేశాం. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ మార్గదర్శకాలను విడుదల చేశాం అని తెలిపారు.







