High Court: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. కె.బాబురావు అనే వ్యక్తి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సిగాచీ యాజామాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే పేలుడు జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో 54 మంది మృతి చెందగా, 28 మంది గాయపడ్డారని, 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వసుదా నాగరాజు హైకోర్టుకు తెలిపారు.
ఇప్పటి వరకు మృతుల ఆచూకీ లేని వాళ్ల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రకటించిన పరిహారం చెల్లించలేదు. పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బయటపెట్టాలి. భానూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందంతో చేయించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమలపై అన్ని భద్రతా చర్యలు ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి అని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. అనంతరం ఈ పిటిషన్‌పై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.