Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ -2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి డిసెంబరు 7కు రెండేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వచ్చేనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో (Hyderabad) తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను (Global Summit) నిర్వహించనుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ (Future City) లో సుమారు 100 ఎకారాల విస్తీర్ణంలో దీనిని నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక్కడ ప్రభుత్వ స్టాళ్లు, పలు ప్రైవేటు కంపెనీల స్టాళ్లను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
2035 నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. 8న స్థానిక, జాతీయ అంతర్జాతీయ నిపుణులతో సమావేశాలు, చర్చలు ఉంటాయి. 9న తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేస్తారు. భారీగా డ్రోన్ షోను కూడా నిర్వహించనున్నారు. సమ్మిట్ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలు, దార్శనిక పత్రానికి తుదిరూపు ఇవ్వడం తదితర అంశాలపై దిశా నిర్దేశం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9Revanth Reddy) ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. దేశ, విదేశాలకు చెందిన సుమారు 500 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వారికి ఆథ్యిం, భద్రతా చర్యలపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేయనున్నారు.






