Bhatti Vikramarka: ఈ బిల్లుకు పార్లమెంట్‌లో అన్ని పార్టీల మద్దతు : డిప్యూటీ సీఎం భట్టి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కులగణన అవసరం లేదని బీజేపీ మొదట మాట్లాడిరది. తెలంగాణ ప్రభుత్వం, రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఒత్తిడితో జనగణనలో కులగణన చేరుస్తామని ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండిరగ్‌లో ఉంది. ఈ బిల్లుకు పార్లమెంట్ (Parliament) లో అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తాం. కులగణనను క్యాబినెట్‌లో, శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాం. అసెంబ్లీ (Assembly) లో మద్దతు తెలిపిన పార్టీలు పార్లమెంట్‌లోన మద్దతు తెలపాలి. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ముందుకెళ్తాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావుకు బీసీలంటే చిన్నచూపు ఉన్నట్లుంది. ఆయన పంపిన లీగల్ నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. బీఆర్‌ఎస్ ప్రజలను మభ్యపెట్టింది. అందరూ అలాగే చేస్తారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారేమో. కులగణన సర్వేను చాలా పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాం. అందుకే తెలంగాణను చూసి కేంద్రం కూడా కులగణనను ప్రకటించింది అని అన్నారు.