Komatireddy Venkat Reddy: హ్యామ్ రోడ్లకు త్వరలోనే టెండర్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణలో హ్యామ్ (HAM) రోడ్ల నిర్మాణాలకు వచ్చే వారం టెండర్లు పిలుస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. గురువారం సెక్రటేరియట్లో జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఎన్హెచ్ఏఐ (NHAI) మరియు ఎంఓఆర్టీహెచ్ (MoRTH) ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. విద్యుత్ లైన్ల మార్పు, నీటి సరఫరా, అటవీ క్లియరెన్స్‌లపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో రాష్ట్ర స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్, ఇతర శాఖల అధికారులు, ఎన్హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ రీజినల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మంత్రి (Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ.. మొదలు పెట్టిన రోడ్ల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్‌లో రూ.6 వేల కోట్లతో పనులు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఆర్ (RRR)పై ఈ నెల చివరి నాటికి స్పష్టత వస్తుందని, 90 శాతం భూ సేకరణ పూర్తయిందని అన్నారు. ఈ నెల 12న హ్యామ్ రోడ్లపై కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీతో (Nitin Gadkari) జరిగిన సమావేశంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులకు, విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్ హైవేను మంజూరు చేసేందుకు ఆయన అంగీకరించారని, ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్‌కు ఈ నెలలో కేంద్ర కేబినెట్ ఆమోదం లభిస్తుందని హామీ ఇచ్చారని మంత్రి (Komatireddy Venkat Reddy) పేర్కొన్నారు.







