ఐటీ ఎగుమతులు, పెట్టుబడుల పెంపులే లక్ష్యంగా తెలంగాణ ఐటీ విధానం 2021-2026 విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణ, భవిష్యత్తు టెక్నాలజీలతో మెరుగైన సత్వర పౌరసేవలే లక్ష్యంగా తెలంగాణ ఐటీ విధానం 2021-2026ను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే. తారకరామారావు విడుదల చేశారు. రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్లతో ‘స్టార్టప్ ఫండ్’ను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మంత్రి తెలిపారు. స్టార్టప్‌లకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా 8,000 కంపెనీలకు మద్దతు అందిస్తామని, మరోవైపు వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో ఐటీ విభాగంలో ఉద్యోగుల సంఖ్యను పది లక్షలకు చేర్చడం, ఐటీ ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు పెంచడమే ఈ పాలసీ లక్ష్యమని ప్రకటించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో నాస్కామ్, యాక్సెంచర్ ఛైర్పర్సన్ రేఖామీనన్, సైయంట్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, టీసీఎస్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజన్న, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రైఫ్ మ్యాన్, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కొత్త ఐటీ విధానాన్ని విడుదల చేశారు. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ విధానం ప్రతులను వేదికపైకి చేర్చారు. వచ్చే అయిదేళ్లలో ఐటీ ఎగుమతులను 3లక్షల కోట్లకు పెంచాలని, రూ.85 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఐటీలో రూ.3.5 లక్షలు, ఎలక్ట్రానిక్స్‌లో 3 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఎలక్ట్రానిక్స్‌లో రూ.75 వేల కోట్లు, అలాగే 8 వేల అంకురాల ద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు సమీకరిస్తామని చెప్పారు. ఐటీ ఉత్పాదకత అభివృద్ధి, ఇంజినీరింగు, పరిశోధన, అభివృద్ధిలో తెలంగాణను ప్రపంచస్థాయి కేంద్ర స్థానం (గ్లోబల్ హబ్)గా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ సేవలు విస్తరిస్తామని, 40 స్మార్ట్ పట్టణాలను అభివ ృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు.
తెలంగాణలో తలసరి ఆదాయం ఏడేండ్లలో దాదాపు రెట్టింపయిందని చెప్పారు. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలో ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటికంటే ఐటీ ఎగుమతులు రెండిరతలు అయ్యాయని వెల్లడిరచారు. 2013-14లో రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు.. 2020-21 నాటికి రూ.లక్షా 45 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. ప్రపంచంలో అత్యున్నత ఐదు కంపెనీలు హైదరాబాద్‌లో తమ ఆఫీస్‌లను ఏర్పాటు చేశాయన్నారు. అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.ఎలక్ట్రానిక్స్ రంగంలో 1.5 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయని మంత్రి చెప్పారు. టాస్క్ ద్వారా మూడు లక్షల మందికి పైగా నిపుణులను తయారు చేశామన్నారు. ఐదు వందలకు పైగా ప్రభుత్వ సేవలు మీ సేవ ద్వారా అందిస్తున్నామని వెల్లడిరచారు. స్మార్ట్ గవర్నమెంట్ విభాగంలో తెలంగాణ జాతీయ అవార్డులు గెలుచుకుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 5 లక్షల మందికిపైగా డిజిటల్ ఎడ్యుకేషన్ అందించామన్నారు. టైర్-1, టైర్-2 ఐటీ విస్తరణ కోసం ఐటీ- హబ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రెండో ఐసీటీ ద్వారా ప్రజలకు అత్యాధునిక టెక్నాలజీని మరింత చేరువచేసే కార్యక్రమాలు చేపడుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పంచాయతీ స్థాయిలో డిజిటల్ సేవలు అందించేందుకు 12 వేల డిజిటల్ తెలంగాణ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచంలోని ఉత్తమ స్మార్ట్‌సిటీ ప్రమాణాలకు అనుగుణంగా 40 స్మార్ట్ రీజియన్స్ ఏర్పాటుచేసేలా మున్సిపల్‌శాఖతో కలిసి స్మార్ట్‌సిటీస్ విభాగం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడిరచారు. ఐటీరంగం వృద్ధి, పౌరులకు మెరుగైన ఐటీసేవల లక్ష్యంతో ఐదేండ్లకాలానికి 2016లో చేపట్టిన మొదటి ఐసీటీ వందశాతం విజయవంతమైందని చెప్పారు. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో రాష్ట్రం అత్యధిక వార్షిక వృద్ధిరేటు నమోదు చేసిందని చెప్పారు.
టెక్‌మహీంద్రా, సైయెంట్ తమ కార్యాలయాలను వరంగల్‌లో ప్రారంభించాయని తెలిపారు. టీసీఎస్, విప్రో, ఆక్సెంచర్ వంటి కంపెనీలు కూడా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని విజ్ఞప్తిచేశారు.
రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టం వృద్ధిచేసేందుకు టీ-హబ్, టీఎస్ఐసీ, వీ-హబ్, రిచ్, టాస్క్, టీ-వర్క్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుచేశామని కేటీఆర్ తెలిపారు. మెంటార్షిప్, ఇంక్యుబేషన్, పరిశ్రమ అనుసంధానం విషయంలో 1,500 స్టార్టప్స్ మద్దతు పొందాయని చెప్పారు. ఐదేండ్లలో రూ.1,800 కోట్లు సమీకరించి పరిశ్రమ అవసరాలకు తగినట్టు టాస్క్ ద్వారా మూడు లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ మద్దతుతో నడుస్తూ దేశంలోనే అత్యధిక ప్లేస్‌మెంట్స్ రేట్ ఉన్న సెంటర్‌గా టాస్క్ నిలిచిందని వెల్లడించారు. మీ సేవ ద్వారా 500, టీ-యాప్ ద్వారా 250 ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని చెప్పారు. మీ సేవ సేవల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ-గవర్నెన్స్‌లో భాగంగా ప్రారంభించిన ఆర్టీడీఏఐ, డిజిటల్ వెరిఫికేషన్ సేవలు పలు అవార్డులు గెలుచుకొన్నాయని, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్‌తో ఓపెన్ డాటా, బ్లాక్ చెయిన్, డాటా అనలటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ అడాప్షన్, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ విభాగాల్లో సెక్టోరల్ పాలసీలు ప్రారంభించామన్నారు.
డబ్ల్యూఈఎఫ్, యూఎన్డీపీ, ప్రపంచబ్యాంకు వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో తెలంగాణను లీడర్‌గా నిలిపేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. డిజిటల్ తెలంగాణ ఆవిష్కరణలో భాగంగా హైదరాబాద్‌లో మూడువేల పబ్లిక్ వైఫై యాక్సెస్ పాయింట్లు ఏర్పాటుచేశామని, వీటిని ఇతర పట్టణాలకు కూడా విస్తరిస్తున్నామని తెలిపారు. ఐదు లక్షలమంది గ్రామీణులను డిజిటల్ లిటరేట్స్‌గా తీర్చిదిద్దామని కేటీఆర్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు డిజిటల్ పాఠాలు నేర్పేందుకు చేపట్టిన డిజిటల్ లిటరసీ స్కీమ్‌లో ఉత్తమంగా పనిచేసిన విలేజ్ లెవల్ ఎంటర్ప్రెన్యూర్ రత్లావత్ శంకర్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. గ్రామీణ ప్రాతాల్లో ఈ-కామర్స్‌ను ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘గ్రామీణ్ ఈ స్టోర్’లో అత్యధిక అమ్మకాలు జరిపిన కొడికంటి వెంకన్నకు అభినందనలు తెలిపారు. ఐసీటీ పాలసీ-2 విడుదల కార్యక్రమంలో ప్రభుత్వం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకొన్నది. పలు నూతన కార్యక్రమాలు ప్రారంభించింది.
ఐటీ పరిశ్రమ వృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, పరిశ్రమకు మంచి భాగస్వామిగా నిలుస్తున్నదని నాస్కాం, యాక్సెంచర్ చైర్పర్సన్ రేఖా మీనన్ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రంగ్లాలో స్పష్టమైన విజన్ ఉన్నదని, దానిని పక్కా ప్రణాళికతో అమలు చేసే (ఎగ్జిక్యూట్) సమర్ధత ఉన్నదని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో స్టార్టప్‌ల సేవలన్నీ ఒకే వేదిక మీదికి తెస్తూ రూపొందించిన ‘స్టార్టప్ తెలంగాణ పోర్టల్’ను ఆవిష్కరించారు.
రాష్ట్రంలో ‘నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్’ (ఎన్సీఏఎం)ను ప్రారంభించనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ (ఎంఈఐటీవై) కార్యదర్శి అజయ్ ప్రకాశ్ స్వాహ్నె ప్రకటించారు.
బీఎల్ఎస్ఐ/ఫ్యాబ్లెస్ చిప్ డిజైనింగ్‌లో స్టార్టప్‌లకు మద్దతుగా నిలిచేందుకు రూపొందించిన వర్చువల్ ప్లాట్‌ఫామ్ ‘టీ-ఫేస్’ (టీ-ఫ్యాబ్లెస్ యాక్సిలరేటర్ త్రూ క్లౌడ్ ఎనబ్లెమెంట్)ను ప్రారంభించారు.
స్టార్టప్‌లను ప్రారంభించేలా యువతను ప్రోత్సహించేందుకు ఇన్నొవేషన్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఐ2ఈ) ల్యాబ్ రెండో దశకు శ్రీకారం చుట్టారు. ఇది 14 వారాల కార్యక్రమం.
ఐసీటీ పాలసీ-2 ముఖ్యాంశాలు
ఐటీ, ఐటీ ఉత్పత్తుల అభివృద్ధి, ఇంజినీరింగ్, పరిశోధన, ఎలక్ట్రానిక్స్, ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ అండ్ రీ స్కిల్లింగ్, కాగితరహిత, భౌతిక హాజరు లేని పాలన అందించడం, డిజిటల్ మౌలికవసతులు, డిజిటల్ పరిజ్ఞానంలో పౌరుల సాధికారత, భవిష్యత్తరం సాంకేతికత, నగరజీవనానికి అవసరమైన టెక్నాలజీ, ఐటీఅండ్‌సీ డిపార్ట్మెంట్ టెక్ ఎనేబ్లర్ వంటివి ఉన్నాయి. ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా ఇందులో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి కేటాయింపు, విద్యుత్తు సౌకర్యం, ఐటీ పార్క్ హోదా కల్పన, క్వాలిటీ సర్టిఫికేషన్, రెంటల్ రిఫండ్, పరిశోధనలకు నిధులు, పెట్టుబడిపై రాయితీలు ఇతరత్రావంటివి ఉన్నాయి.






