BRAP: తెలంగాణకు అరుదైన గౌరవం
తెలంగాణ (Telangana) కు అరుదైన గౌరవం దక్కింది. సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)కు సంబంధించిన సంస్కరణల అమలులో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ (బీఆర్ఏపీ)-2024లో టాప్ అచీవర్‌గా ఘనత సాధించింది. ఇందుకు సంబంధించిన అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ (Sanjay Kumar) న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) చేతులమీదుగా స్వీకరించారు. బిజినెస్ ఎంట్రీ, నిర్మాణ అనుమతుల ప్రక్రియ(కన్స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబ్లర్స్), సేవారంగం, భూపరిపాలన విభాగాల్లో అమలు చేసిన సంస్కరణలకు గాను రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. దేశంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ), బీఆర్ఏపీ-2024 ఏడో ఎడిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్మిక చట్టాలు, భూపరిపాలన, ఆస్తుల రిజిస్ట్రేషన్, పెట్టుబడి అవకాశాలు, పర్యావరణ అనుమతులు వంటి 434 అంశాలకు సంబంధించిన సంస్కరణలను ఈ కార్యక్రమంలో భాగం చేసింది. బీఆర్ఏపీ(BRAP)-2024 మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అన్ని సంస్కరణలను విజయవంతంగా అమలు చేసింది. బిజినెస్ ఎంట్రీ, నిర్మాణ అనుమతుల ప్రక్రియ, సేవా రంగం, భూపరిపాలన విభాగాల్లో అగ్రగామిగా నిలిచి అవార్డు సాధించింది.







