Global Summit: డిసెంబరు లో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Rising Global Summit)-2025 సదస్సుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. డిసెంబరు 8, 9 తేదీల్లో హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు సుమారు 1,300 అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సదస్సు కోసం మీర్ఖాన్పేట సమీపంలో 100 ఎకరాల భూమి చదును చేస్తున్నారు. మరో 200 ఎకరాల్లో పార్కింగ్, రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా తదితర పనులు చేపట్టారు. ఈ ఏర్పాట్లను సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy), ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతుండటం, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) పుట్టినరోజు సందర్భంగా ప్రజాపాలన- ప్రజావిజయోత్సవాల నినాదంతో ఈ సదస్సును నిర్వహించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డుతోపాటు ఫార్మా తదితర రంగాలకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దీనిని చేపట్టారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ భారీ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్లు ఇస్తారు. పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు, భూముల కేటాయింపులూ జరగనున్నాయి. సామాన్యుల కోసం మరో 2 రోజులు సదస్సును పొడిగించారు. డిసెంబరు 10, 11వ తేదీల్లో వివిధ జిల్లాల నుంచి ప్రజలను సదస్సుకు తరలించి, ఎగ్జిబిషన్ చూసేందుకు అవకాశం కల్పిస్తారు.






