తెలంగాణలో పెరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం నెలనెలకు భారీగా పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలాఖరుకు రూ.4,700 కోట్లు ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరికల్లా రూ.3,600కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం కేవలం దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4,221 కోట్ల రాబడి రాగా.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,376కోట్లు సమకూరింది. 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.1,100 కోట్లు, దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.845 కోట్ల రాబడి ఎక్కువగా వచ్చింది. అంటే ఈసారి 30 శాతం వరకు వద్ధిరేటు నమోదైనది. 2017-18లో స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఆదాయం రూ.మూడు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేయగా.. అది కాస్తా రూ.నాలుగు వేల కోట్లను దాటి రికార్డుగా నిలిచింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.ఐదు వేల కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్‌లో అంచనావేయగా కేవలం తొమ్మిది నెలల్లోనే నిర్ధేశిత లక్ష్యంలో 85 శాతం ఆదాయం వచ్చింది.
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో అధిక సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. 2017-18లో రాష్ట్రం మొత్తంమీద 11.50 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టరయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలాఖరుకు 8,15,640 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదే సమయానికి 10.86 లక్షల వరకు రిజిస్టరయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.1,500 కోట్ల రాబడి సమకూరగా.. రూ.933 కోట్లతో రెండో స్థానంలో మేడ్చల్, రూ.612 కోట్లతో మూడవ స్థానంలో హైదరాబాద్ నిలిచాయి. మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకొన్నది. దాదాపు రూ.360 కోట్ల రాబడి సాధించి మెదక్ జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది.