Telangana Local Body Polls: తెలంగాణలో మరోసారి స్థానిక ఎన్నికలు వాయిదా?.. కారణం ఇదే

తెలంగాణలో స్థానిక ఎన్నికలు (Telangana Local Body Polls) మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో మరోసారి కులగణన సర్వే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో ఎన్నికలు మరింత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దీంతో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే స్థానిక ఎన్నికలు (Telangana Local Body Polls) జరిగే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల (Telangana Local Body Polls) నిర్వహణ, రిజర్వేషన్లపై చర్చ ఈ సమావేశంలో నేతలు చర్చించారు. సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లపై చర్చించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై కూడా ఈ సమావేశాల్లో సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై మార్చి మొదటి వారంలో కేబినెట్ తీర్మానం చేస్తుందని, శాసనసభలో బిల్లును గెలిపించుకొని చట్టబద్ధం చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ఆమోదానికి కృషి చేస్తామని వెల్లడించారు. రిజర్వేషన్లపై రాజకీయపరంగా కుట్రలు చేస్తే తమ పార్టీ ఏమాత్రం సహించబోదని, ఈ కుట్రలను తిప్పి కొడతామని, రాజకీయ లబ్ధి పక్కన పెట్టి మద్దతు పలకాలని అందర్నీ కోరుతున్నామని ఆయన చెప్పారు.