Anganwadi centers: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ..అంగన్వాడీ కేంద్రాల్లో
తెలంగాణ రాష్ట్రంలో పౌష్టికాహార లోపం నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అంగన్వాడీ కేంద్రాల్లో (Anganwadi centers) 3-6 ఏళ్ల మధ్య వయస్సు గల చిన్నారులకు ఏడాదిలో 200 రోజుల పాటు రోజూ 100 మి.లీ విజయా డెయిరీ (Vijaya Dairy) పాలు పంపిణీ చేయడానికి స్త్రీ, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా (Shruti Ojha) ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు లీటర్ విజయా డెయిరీ డబుల్ టోన్డ్ యూహెచ్టీ టెట్రా ప్యాకెట్లను పంపిణీ చేస్తారు. ఆ పాలను వేడి చేసి పంచదార/బెల్లం కలిపి గోరు వెచ్చగా పిల్లలకు అందించాల్సి ఉంటుంది. ములుగు జిల్లా కేంద్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ పథకంపై క్షేత్రస్థాయి ఉద్యోగులు, పిల్లల తల్లి దండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించాలని శ్రుతి ఓఝా ఆదేశించారు. కాగా, అంగన్ వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ములుగులోని కృష్ణ కాలనీ ప్రీ-స్కూల్ పిల్లలకు పాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభిస్తూ, అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకొచ్చే చిన్నారులను సొంత పిల్లల్లా చూసుకోవాలని టీచర్లకు హితవు చెప్పారు.






