Kavitha: “ఏదో ఒక రోజు సీఎం అవుతా.. అందరి జాతకాలు బయటపెడతా..” కవిత నిప్పులు!
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కల్వకుంట్ల కవిత, సొంత పార్టీ నేతలపై, తన కుటుంబ సభ్యుల పాలనపైనే ప్రత్యక్షంగా సంచలన ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను జాగృతి జనం బాట ప్రారంభించగానే తనపై రాజకీయ కుట్రలు మొదలయ్యాయని, తన భర్త అనిల్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ఆమె, పలు సంచలన అంశాలపై మాట్లాడారు.
పదేళ్ళ కేసీఆర్ పాలనలో తానుగానీ, తన భర్తగానీ ఏనాడూ లబ్ధి పొందలేదని కవిత స్పష్టం చేశారు. “గత పదేళ్లలో మేము ఏ ఒక్క మంత్రి దగ్గరికి గానీ, కేసీఆర్, కేటీఆర్ దగ్గరికి గానీ వెళ్లి మాకు ఫేవర్ చేయమని అడగలేదు,” అని ఆమె తెగేసి చెప్పారు. ఉద్యమ సమయంలో కొందరు బెదిరించి డబ్బులు దండుకున్నారని పరోక్ష విమర్శలు చేసిన ఆమె, తాను మాత్రం బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం సొంత నగలు కుదువపెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బీఆర్ఎస్ అధినాయకత్వంపై ఆమెకున్న అసంతృప్తిని, తనను దూరం పెట్టారన్న భావనను బహిర్గతం చేస్తోంది.
తన భర్త అనిల్ కుమార్‌కు ఏవీ రెడ్డితో వ్యాపార సంబంధాలు అంటగట్టడంపై కవిత మండిపడ్డారు. ముఖ్యంగా భూముల వ్యవహారంలో సంచలన విషయాలను బయటపెట్టారు. 2019 నుంచి తన భర్తకు సదరు భూమితో సంబంధం లేదని, కానీ అదే భూమిని ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మారుస్తూ 2022లో, ఎన్నికల ముందు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ జీవోల మీద సాక్షాత్తు కేటీఆర్ సంతకం పెట్టారని గుర్తు చేయడం ద్వారా, ఆ అక్రమాల్లో తన పాత్ర లేదని, బాధ్యత అంతా నాటి ప్రభుత్వ పెద్దలదేనని ఆమె స్పష్టం చేశారు.
తనపై, తన భర్తపై ఆరోపణలు చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావులకు కవిత లీగల్ నోటీసులు పంపుతున్నట్లు ప్రకటించారు. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాసిన ‘టీ న్యూస్’ కి కూడా నోటీసులు ఇస్తాననడం గమనార్హం. మాధవరం కృష్ణారావు, కేటీఆర్ సన్నిహితుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిల దందాలపై తన దగ్గర సమాచారం ఉందని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులు ఇప్పుడు తన దృష్టికి వస్తున్నాయని చెప్పడం ద్వారా, తాను అవినీతికి వ్యతిరేకమనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందన్న అనుమానాలను కవిత లేవనెత్తారు. “బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే, కాంగ్రెస్ తలుపులు తెరిచింది” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి ఆరోపణలపై ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని, కేటీఆర్ మిత్రుల ఫామ్ హౌస్ కేసులను ఎందుకు పక్కనపెట్టారని ఆమె నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హరీష్ రావుపై తాను ఆరోపణలు చేస్తే, వారు నేరుగా సమాధానం చెప్పకుండా బీజేపీ నేతలతో మాట్లాడిస్తున్నారని, ఇది వారి మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు.
ప్రెస్ మీట్లో అత్యంత కీలకమైన అంశం కవిత తన రాజకీయ ఆశలను బహిర్గతం చేయడం. “నాక్కూడా టైం వస్తుంది. నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాను. అప్పుడు తప్పకుండా 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తాను,” అని ఆమె శపథం చేశారు. తనను పార్టీ నుంచి పంపించినా వారి కసి తీరలేదా అని ప్రశ్నిస్తూనే, తనపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. “నేను మంచి దాన్ని కాదు.. లైన్ దాటలేదు.. దాడి చేస్తే కాళ్లు విరగ్గొడతా” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
మొత్తానికి కవిత ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఆమె మాటలను బట్టి చూస్తే, ఆమె ఇకపై బీఆర్ఎస్ లైన్లో నడిచే అవకాశం లేదని, తనకంటూ సొంత రాజకీయ అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సొంత సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావులను లక్ష్యంగా చేసుకోవడం, కేసీఆర్ పాలనలోని లొసుగులను బయటపెడతానని హెచ్చరించడం ద్వారా కవిత రాబోయే రోజుల్లో ‘రెబల్’ స్టార్‌గా మారబోతున్నారని స్పష్టమవుతోంది.






