Saudi: వారి కుబుంబాలకు రూ.5 లక్షలు పరిహారం
సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుబుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin) , మజ్లిస్ ఎమ్మెల్యేతోపాటు మైనారిటీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన బృందాన్ని సౌదీకి పంపింది. మృతుల అంత్యక్రియలను మత సంప్రదాయం ప్రకారం మక్కాలోనే నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున మృతుల బంధువులను మక్కా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం దుఃఖాన్ని కలిగించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందించాలని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవలని ప్రభుత్వానికి సూచించారు. సౌదీ ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సీఎం సూచన మేరకు తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.






